Begin typing your search above and press return to search.

ప్రవీణ్ కుమార్ లెక్కేంది? కేసీఆర్ ను నమ్ముడేంది?

కేసీఆర్ అధికారంలో ఉన్న వేళలో.. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగేవారు.

By:  Tupaki Desk   |   19 March 2024 4:34 AM GMT
ప్రవీణ్ కుమార్ లెక్కేంది? కేసీఆర్ ను నమ్ముడేంది?
X

తెలంగాణ పోలీసు విభాగంలో బోలెడంత మంది ఆఫీసర్లు ఉన్నా.. మిగిలిన వారికి కాస్త భిన్నంగా వ్యవహరించటమే కాదు.. సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన స్ఫూర్తి వంతమైన మాటలతో మనసుల్ని దోచుకునే ఆయన.. తాజాగా గులాబీ కారును ఎక్కేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి చెబుతూ.. తాను టీఎస్ పీఎస్ బిగ్ బాస్ పోస్టును చేపట్టాలంటూ ఆఫర్ ఇచ్చానని.. కానీ ఆయన మాత్రం అందుకు అంగీకరించలేదన్న కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. నిరుద్యోగ యువత బతుకును మార్చేందుకు లభించిన పెద్ద అవకాశాన్ని వదిలేసి.. అధికారంలో లేని పార్టీలో చేరుడేందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇంతకూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు నో చెప్పినట్లు? అధికారం చేతిలో లేని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని పార్టీలో చేరేందుకు ఎందుకు సిద్ధమైనట్లు? నిరుద్యోగులకు సాయం చేయాల్సిన విషయాన్ని వదిలేసి.. రాజకీయ పార్టీల్లో మారే అంశం మీదా ఫోకస్ పెట్టటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. అధికారానికి దూరంగా.. ప్రతిఫక్షంలో ఉన్న పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతుంటే భారీగా ప్రయోజనం ఉంటుందన్న వాదనలో పస లేదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేసీఆర్ అధికారంలో ఉన్న వేళలో.. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగేవారు. సీఎం హోదాలో కేసీఆర్ ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో వైఫల్యం చెందినట్లుగా ఆరోపించేవారు. ముడపులు తీసుకొని పనుల్ని పక్కన పెట్టేశారన్న వాదనను వినిపించారు. మొత్తంగా నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ను చావు తిట్లు తిట్టిన ప్రవీణ్ ఈరోజున ఆయన పార్టీలో చేరటంలో లాజిక్కు ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. తాను కష్ట కాలంలో ఉన్నప్పుడు గులాబీ కారులో ఎక్కిన ప్రవీణ్ కు పార్టీలో పెద్ద పదవిని ఇస్తామని కేసీఆర్ చెప్పిన వైనం చూస్తే.. నాటకాన్ని మరింత రక్తి కట్టించేలా ఉందని చెప్పాలి.

మొన్నటి వరకు పెద్ద పెద్ద మాటలు.. ఆదర్శాల్ని వల్లించిన ప్రవీణ్ సారు.. ఈరోజు పెద్ద సారును కలుసుడే కాదు.. ఆయన పార్టీలో చేరుడు వెనుకున్న లాజక్కును అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది. అలాంటిదేమీ లేకుండా గులాబీ కండువా మెడలో కప్పించుకోవటాన్ని ఆయన్ను అభిమానించిన వారు అర్థం చేసుకోలేక తలలు బద్ధలు కొట్టుకుంటున్న పరిస్థితి. అంతేకాదు.. ప్రవీణ్ ను అభిమానించిన వారి నోటి నుంచి తాజాగా వస్తున్న మాట ఒక్కటే.. ప్రవీణ్ సారు లెక్కేంది? పెద్ద సారును నమ్ముడేంది? అని. దీనికి సరైన సమాధానం చెప్పేవారెవరు?