Begin typing your search above and press return to search.

ఆర్‌ఆర్‌ఆర్‌ ను లైట్‌ తీసుకుంటున్నారా?

కాగా తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున లేదా బీజేపీ తరఫున లేదా జనసేన తరఫున ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానని రఘురామ చెబుతూ వచ్చారు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:46 AM GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ ను లైట్‌ తీసుకుంటున్నారా?
X

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గురించి తెలియనివారెవరూ లేరు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలుపొందారు. అయితే గెలిచిన కొంతకాలానికే ఆయనకు వైసీపీ అధిష్టానంతో అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌ చానెళ్ల ఇంటర్వ్యూల్లో ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 20కి మించి అసెంబ్లీ స్థానాలు రావని ఆర్‌ఆర్‌ఆర్‌ తేల్చిచెబుతున్నారు.

మరోవైపు వైసీపీ ప్రభుత్వం రఘురామరాజుపై పలు కేసులు నమోదు చేసింది. గతంలో సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. స్వయంగా తనను కొడుతూ తీసిన వీడియోను సీఐడీ అధికారులు వైఎస్‌ జగన్‌ కు పంపారని రఘురామ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.

గత ఎన్నికల్లో గెలిచింది మొదలు రఘురామ ఒకటి రెండుసార్లు మినహా రాష్ట్రానికి వచ్చింది లేదు. తాను ఏపీలో అడుగుపెట్టడం ఆలస్యం జగన్‌ ప్రభుత్వం తనపై ఏదో కేసు నమోదు చేస్తోందని రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి వై కేటగిరీ రక్షణ సైతం పొందారు. తాజాగానూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. సంక్రాంతి పండుగ కోసం తాను భీమవరం వస్తున్నానని.. జగన్‌ ప్రభుత్వం తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కాగా తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున లేదా బీజేపీ తరఫున లేదా జనసేన తరఫున ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానని రఘురామ చెబుతూ వచ్చారు. అయితే మూడు పార్టీలు ఆయనను లైట్‌ తీసుకుంటున్నాయనే ప్రచారం జరుగుతోంది.

టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. పొత్తు నేపథ్యంలో సీట్లు దక్కని ఇరు పార్టీల నేతలకు ఏదో రూపంలో న్యాయం చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లపై ఉందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కొత్తగా రఘురామకృష్ణరాజుకు సీటు ఇచ్చే పరిస్థితి లేదని టాక్‌ నడుస్తోంది. సోషల్‌ మీడియాలో గత కొద్ది రోజులుగా ఈ ప్రచారం భారీ ఎత్తున సాగుతోంది.

గత నాలుగున్నరేళ్లుగా ఆయన నరసాపురం నియోజకవర్గానికి రాలేకపోవడం, స్థానిక నేతలతోనూ లేని సత్సంబంధాలు, స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో కుంటుపడిన అభివృద్ధి, అనుచరులు సైతం గుంభనంగా ఉండిపోవడం వంటి కారణాలతో రఘురామకు మళ్లీ సీటిచ్చినా గెలిచే పరిస్థితులయితే లేవనే టాక్‌ నడుస్తోంది.

అటు టీడీపీ, ఇటు జనసేన సైతం తనకు టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రఘురామకృష్ణరాజు బీజేపీ వైపు చూస్తున్నారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేకా టీడీపీ, జనసేనలతో కలిసి పోటీ చేస్తుందా అనేది వేచిచూడాలని అంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి రఘురామకు సీటు డోలాయమానమేనని టాక్‌ నడుస్తోంది.

లోక్‌ సభకో, అసెంబ్లీకో పోటీ చేయడం కంటే టీడీపీ–జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన రాజ్యసభకు ప్రయత్నించడం ఉత్తమమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.