బైక్ పై ఘాటు రోమాన్స్.. తిక్క కుదుర్చిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇద్దరు యువతీ యువకులు ప్రవర్తించిన విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 17 Jun 2025 4:46 PM ISTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇద్దరు యువతీ యువకులు ప్రవర్తించిన విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరూ ప్రమాదకరంగా, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రయాణించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
-వీడియోలో ఏముందంటే?
వైరల్ అయిన ఐదు సెకన్ల క్లిప్‌లో ఓ యువకుడు బైక్ నడుపుతుండగా యువతి అతని ముందుగా బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై రివర్స్ పొజిషన్‌లో కూర్చొని ఉంది. యువతి తన కాళ్లను వెనక్కి ఉంచింది. ఇద్దరు హెల్మెట్‌లు ధరించలేదు. యువతి చేతిలో హెల్మెట్ ఉన్నప్పటికీ దాన్ని తగిన విధంగా ఉపయోగించలేదు. ఇలా రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణించడం వల్ల ఇతర వాహనదారులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
-పోలీసులు కఠిన చర్యలు
ఈ వీడియోను గమనించిన నోయిడా ట్రాఫిక్ పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాహనం నంబర్‌ను గుర్తించి, సంబంధిత మోటారు వాహన చట్టంలోని పలు సెక్షన్ల కింద రూ.53,500 జరిమానా విధించారు. ఈ ఘటన నోయిడా సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) లకన్ సింగ్ యాదవ్ తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం.. ప్రమాదకర డ్రైవింగ్, పబ్లిక్ ప్లేస్‌లో అసభ్య ప్రవర్తన కింద ఈ భారీ జరిమానా విధించారు. ఇతర రోడ్ యూజర్లకు హెచ్చరిక కలిగించడంపై మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద చలానా విధించారు.
ఈ సంఘటన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పౌరులకు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. రోడ్లపై నిబంధనలు పాటించకుండా ఇలా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటువంటి నిర్లక్ష్య ప్రవర్తన ఇతరుల ప్రాణాలకూ ముప్పు కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు.
