Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు కొత్త బిరుదిచ్చిన రోజా

సినిమాల్లో మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయితే దోచుకోవడంలో చంద్రబాబు కలెక్షన్ కింగ్ అని రోజా సెటైర్లు వేశారు

By:  Tupaki Desk   |   5 Sep 2023 1:36 PM GMT
చంద్రబాబుకు కొత్త బిరుదిచ్చిన రోజా
X

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముడుపుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఆయన ఎందుకు స్పందించడం లేదని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే చంద్రబాబు ఇటువంటి నోటీసులు తనని ఏమి పీకలేవు అని ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై వైసీపీ మహిళా నేత, మంత్రి రోజా నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని దోచుకోవడంలో చంద్రబాబు దిట్ట అని చురకలంటించారు.

సినిమాల్లో మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయితే దోచుకోవడంలో చంద్రబాబు కలెక్షన్ కింగ్ అని రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై టిడిపి నేతలు ఎవరు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో వేలకోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయని అన్నారు. త్వరలోనే తెలంగాణ నుండి చంద్రబాబును కేసీఆర్ తరిమేస్తారని జోస్యం చెప్పారు.

టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన రోజా ప్రతిరోజు గురువులను పూజించాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పాఠశాలలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్ దే అని కొనియాడారు. గతంలో నారాయణ, చైతన్య పాఠశాలల్లో సీటు దొరికేది కాదని, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు ఆ డిమాండ్ తెచ్చిన ఘనత జగన్ దేనని ప్రశంసించారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మార్కులు సాధించారని రోజా అన్నారు.

ఇక, చంద్రబాబుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా మండిపడ్డారు. చంద్రబాబు పాలన మొత్తం పరిశీలిస్తే వేల కోట్ల అవినీతి బట్టబయలవుతుందని ఆయన అన్నారు. ఇక, చంద్రబాబుకు నోటీసులపై ఆయన దత్తపుత్రుడు పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ ఆ ముడుపుల్లో పవన్ కు కూడా వాటా ఉందేమో అని అనుమానం వ్యక్తం చేశారు.