గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై ఆర్కే రోజా కీలక నిర్ణయం!
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 July 2025 4:47 PM ISTవైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సమయంలో రోజా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తోపాటు జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
అవును... తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంపై మాజీ మంత్రి రోజా సీరియస్ గా స్పందించారు. ఇందులో భాగంగా రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆమె.. కమిషన్ ను కోరారు. అంతకుముందు.. భాను ప్రకాశ్ ను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పార్టీ మహిళా నేతలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. తాజాగా వైసీపీ స్టేట్ మహిళా విభాగం సెక్రెటరీ కొర్ల శిరీష మాట్లాడుతూ మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని గాలి భాను ప్రకాష్ ఎమ్మెల్యే పదవికి ఏమాత్రం అర్హుడు కాదని మండిపడ్డారు.
ఇదే సమయంలో... టీడీపీ నేతలు కాలకేయుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె... ఆర్కే రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలు ఖండించారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే క్రమంలో... సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా భాను ప్రకాష్ మాట్లాడారన్న వరుదు కల్యాణి.. అతడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా... "రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది.. మార్కెట్లో ఆ మాట ఉంది.. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది.. ఆమె వ్యాంప్ కు ఎక్కువ, హీరోయిన్ కు తక్కువ.. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు!" అంటూ టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్.. వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి!
