ఇలా రిటైర్.. అలా పొలిటికల్ హీట్.. రాజేసిన రోహిత్
రోహిత్ శర్మ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను కలవడం కేవలం మర్యాదపూర్వక భేటీనా లేక ఏదైనా ప్రణాళికలో భాగమా అనేది ఇంకా స్పష్టత లేకపోయినా, ఈ సమావేశంపై ప్రజల స్పందన మాత్రం ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 14 May 2025 5:45 PMఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని సీఎం అధికారిక నివాసం ‘వర్ష’లో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఫడ్నవీస్ స్వయంగా తన 'ఎక్స్' ఖాతా ద్వారా ఈ ఫోటోలను పంచుకుంటూ, రోహిత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో, రోహిత్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెడతారా అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
రోహిత్ శర్మ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను కలవడం కేవలం మర్యాదపూర్వక భేటీనా లేక ఏదైనా ప్రణాళికలో భాగమా అనేది ఇంకా స్పష్టత లేకపోయినా, ఈ సమావేశంపై ప్రజల స్పందన మాత్రం ఆసక్తికరంగా మారింది. గతంలో పలువురు ప్రముఖ క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబైలో అపారమైన ప్రజాదరణ కలిగిన రోహిత్‌పై కూడా రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ముంబైలో పుట్టి పెరిగిన రోహిత్‌కు ప్రత్యేకించి ఎలాంటి ప్రచారం అవసరం లేకుండానే ప్రజల్లో బలమైన పట్టు ఉంది. తన క్రికెట్ కెరీర్‌కు తుది అంకంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
ఓవైపు టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రోహిత్, పరిమిత ఓవర్ల క్రికెట్ వన్డేలో కొనసాగుతానని సూచనలు ఇచ్చాడు. అయితే వన్డే కెప్టెన్సీపై ఇంకా స్పష్టత లేదు. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో ఫడ్నవీస్‌తో భేటీ అవ్వడం, రాజకీయ భవిష్యత్తుకు ఏదైనా తెరవెనుక సన్నాహాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలకు తావిస్తోంది.
రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్‌ను పరిశీలిస్తే, అరంగేట్రం నుంచి నిలకడైన ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. 67 టెస్టుల్లో 12 సెంచరీలు సహా 4,301 పరుగులు చేసి, తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఓపెనర్‌గా మారిన తర్వాత అతని టెస్ట్ కెరీర్ కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు, అతని వ్యక్తిగత జీవితంలోనూ కొత్త మలుపు రాబోతోందా? రాజకీయ రంగప్రవేశానికి అవసరమైన మార్గం సుగమం అవుతుందా? అన్న ప్రశ్నలకు మరికొద్ది రోజుల్లో సమాధానం లభించే అవకాశం ఉంది.