Begin typing your search above and press return to search.

పిల్ల‌ల పుట్టినరోజులు.. జెర్సీ..రోహిత్ కొత్త లంబోర్గిని కారు నంబ‌రు

ఇంగ్లండ్ టూర్ ఉనంచి టీమ్ ఇండియా వ‌న్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ భార‌త్ కు తిరిగొచ్చాడు.

By:  Tupaki Desk   |   11 Aug 2025 3:27 PM IST
పిల్ల‌ల పుట్టినరోజులు.. జెర్సీ..రోహిత్ కొత్త లంబోర్గిని కారు నంబ‌రు
X

ఇంగ్లండ్ టూర్ ఉనంచి టీమ్ ఇండియా వ‌న్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ భార‌త్ కు తిరిగొచ్చాడు. అదేంటి..? రోహిత్ అస‌లు ఇంగ్లండ్ వెళ్లిన జ‌ట్టులోనే లేడు క‌దా..? టెస్టుల‌కు గుడ్ బై కూడా చెప్పేశాడుగా... ఇంగ్లండ్ టూర్ ఏమిటి? అనుకుంటున్నారా? జ‌ట్టుతో లేకున్నా.. జ‌ట్టులో లేకున్నా రోహిత్ శ‌ర్మ మాత్రం ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటాడుగా..! అత‌డు ఇటీవ‌ల ఫ్యామిలీతో క‌లిసి ఇంగ్లండ్ వెళ్లాడు. మాంచెస్ట‌ర్ లో జ‌రిగిన భార‌త్-ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ ను కూడా చూశాడు. కొద్ది రోజుల కింద‌ట తిరిగి భార‌త్ కు వ‌చ్చాడు.

ఫిట్ గా ఉన్నాడా.. ఫిట్ నెస్ తో ఉన్నాడా?

ప్ర‌పంచ క‌ప్ సాధించాక రోహిత్ గ‌త ఏడాదే అంత‌ర్జాతీయ టి20ల‌కు గుడ్ బై చెప్పాడు. ఈ ఏడాది ఐపీఎల్ జ‌రుగుతుండ‌గా టెస్టుల‌కూ రిటైర్మెంట్ ఇచ్చాడు. అత‌డు ఈ నిర్ణ‌యం తీసుకోకున్నా.. టెస్టు జ‌ట్టు నుంచి త‌ప్పించే ప్ర‌మాదం ఉంది. దీంతో ముందుగానే త‌న టెస్టు కెరీర్ ను ముగించేశాడు. ఇక మిగిలింది వ‌న్డేలు మాత్ర‌మే. కెప్టెన్ గా 2023లో జ‌రిగిన ప్ర‌పంచ క‌ప్ లో జ‌ట్టును ఫైన‌ల్ చేర్చిన ఈ హిట్ మ్యాన్ ఇప్ప‌టికీ వ‌న్డే జ‌ట్టుకు కెప్టెన్ కూడా. ఆరు నెల‌ల కింద‌ట చాంపియ‌న్స్ ట్రోఫీ సాధించి పెట్టిన రోహిత్ ను.. వ‌చ్చే అక్టోబ‌రులో ఆస్ట్రేలియా టూర్ లో కెప్టెన్ గా ఉంటాడా? అస‌లు ఆట‌గాడిగానైనా ఎంపిక చేస్తారా? అనేది చ‌ర్చ‌నీయంగా మారింది. కార‌ణం.. తాజాగా రోహిత్ ఫిట్ నెస్ పై ప్ర‌శ్న‌లు తలెత్త‌డ‌మే. లండ‌న్ నుంచి ముంబై విమానాశ్ర‌యంలో దిగిన రోహిత్ పూర్తిగా షేప్ ఔట్ అయ్యాడు. పొట్ట పెరిగి.. ఓ అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ అందులోనూ కెప్టెన్ స్థాయిలో అస‌లే లేడు. మ‌రి సెల‌క్ట‌ర్లు ఏం నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

కొత్త కారున్న కెప్టెనూ...

ఏ ప్ల‌స్ గ్రేడ్ క్రికెట‌ర్ గా ఏడాదికి రూ.7 కోట్లు బీసీసీఐ నుంచి అందుకునే రోహిత్ ఐపీఎల్, ఇత‌ర అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ల ద్వారా మ‌రింత సంపాదిస్తున్నాడు. తాజాగా అతడు ల‌గ్జ‌రీ బ్రాండ్ లంబోర్గినికి చెందిన ఉరుస్‌ మోడల్ కారును కొన్నాడు. దీని నంబ‌రు ‘3015’. స‌హ‌జంగానే సెల‌బ్రిటీలు త‌మ ల‌క్కీ నంబ‌రు 9 రావాల‌ని కోరుకుంటారు. 3015 అంకెల‌ను కూడితే 9 వ‌స్తోంది. ఇక‌ రోహిత్ జెర్సీ నంబ‌రు కూడా 45. దీంతో నెటిజ‌న్లు అత‌డి కొత్త కారు నంబ‌రు స్పెష‌ల్ ఏమిటా? అని వెదుకులాట మొద‌లుపెట్టారు.

ఇక రోహిత్ కుమార్తె స‌మైరా పుట్టిన రోజు డిసెంబరు 30. కుమారుడు అహాన్‌ పుట్టిన రోజు నవంబరు 15. ఈ రెండు రోజులు క‌లిసొచ్చేలా రోహిత్ త‌న కారు నంబ‌రును తీసుకున్నాడు. రోహిత్ పాత కారు నంబ‌రు వ‌చ్చేసి 264. ఇది వ‌న్డేల్లో అత‌డి రికార్డు స్కోరు. ప్ర‌పంచ రికార్డు కూడా.

కొస‌మెరుపుః ఇంత‌కూ రోహిత్ కొన్ని లంబోర్గిని ఉరుస్‌ కారు ధర ఎంత ఉంటుంద‌ని అనుకుంటున్నారు..? జ‌స్ట్ రూ. 4.57 కోట్లు.