Begin typing your search above and press return to search.

అజిత్ పవార్ మరణం.. హెరిటేజ్ పై ఎన్సీపీ ఆరోపణలు - ఇదేం ట్విస్టు

అజిత్ పవార్ మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని శరద్ పవార్ వర్గం తొలి నుంచి ఆరోపిస్తోంది.

By:  Tupaki Political Desk   |   21 Feb 2026 6:55 PM IST
అజిత్ పవార్ మరణం.. హెరిటేజ్ పై ఎన్సీపీ ఆరోపణలు - ఇదేం ట్విస్టు
X

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఆయన మేనల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై న్యాయ విచారణ జరిపించాలని కోరుతున్న రోహిత్ పవార్ కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదానికి గురైన విమానం యాజమాన్య సంస్థ వీఎస్ఆర్ వెంచర్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కు సంబంధాలు ఉన్నాయని, అందుకే వీఎస్ఆర్ యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు.

దేశ రాజకీయాల్లో రోహిత్ పవార్ ఆరోపణలు సంచలన చర్చకు దారి తీస్తున్నాయి. అజిత్ పవార్ మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని శరద్ పవార్ వర్గం తొలి నుంచి ఆరోపిస్తోంది. ఈ విషయమై న్యాయవిచారణ జరిపించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేయగా, అజిత్ పవార్ భార్య మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ కూడా సమర్థించారు. దీంతో మరింత గట్టిగా తన వాదన వినిపిస్తున్న రోహిత్ పవార్ శనివారం వరుసగా రెండో రోజు కూడా ఇదే విషయమై మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఎన్సీపీ (ఎస్) అధినేత శరద్ పవార్ నివాసంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రోహిత్ పవార్ తన మేనమామ డిప్యూటీ సీఎం అజిత్ దాదా మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా, సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ తో వీఎస్ఆర్ వెంచర్స్ కు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు కొన్నిపత్రాలను రోహిత్ పవార్ ప్రదర్శించారు. తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సీఎం భార్య భువనేశ్వరి, కోడలు భవనేశ్వరి ఫొటోలతోపాటు వీఎస్ఆర్ వెంచర్స్ అధినేత విక్రమ్ సింగ్ ఫొటోను కూడా చూపుతూ తీవ్ర ఆరోపణలు చేశారు రోహిత్ పవార్. అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో పెట్రోల్ ఉందని, పైలట్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని ఆయన ఆరోపించాడు.

విమాన ప్రమాదంలో కుట్ర ఉందని, కోట్ల రూపాయల బీమా కోసమే ఇదంతా చేసినట్లు ఉందని రోహిత్ పవార్ ఆరోపిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్ ను అరెస్టు చేయకుండా డీజీసీఏలో కొందరు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అండదండలతోనే వీఎస్ఆర్ వెంచర్స్ యజమానులపై చర్యలు తీసుకోవడం లేదని రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా రామ్మోహన్ నాయుడును మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.

విమానయాన సంస్థను కాపాడేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఎన్సీపీ (ఎస్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపణలు జాతీయస్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. వీఎస్ఆర్ యజమాని రోహిత్ సింగ్ వివాహానికి టీడీపీ ప్రముఖులు వెళ్లారని, ఆ సంస్థకు చెందిన విమానాన్ని ఏపీ మంత్రి ఒకరు రూ.160 కోట్లు పెట్టి కొన్నారని రోహిత్ పవార్ ఆరోపించారు. ఇవన్నీ అజిత్ పవార్ మరణంపై అనుమానాలు పెంచుతున్నాయని విపక్షం వ్యాఖ్యానిస్తోంది. ఈ విమర్శలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటివరకు స్పందించలేదు. టీడీపీ సైతం ఆ విమర్శలపై ఎటువంటి ప్రకటన చేయలేదని అంటున్నారు.