Begin typing your search above and press return to search.

సామీ.. మనుషుల ఉద్యోగాలు కాపాడండి బాబోయ్.. వార్సా వీధుల్లో రోబోల సెటైరికల్ స్ట్రైక్

పోలాండ్ రాజధాని వార్సాలోని డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆఫీసు ముందు ఇటీవల ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.

By:  A.N.Kumar   |   9 Sept 2026 9:19 PM IST
సామీ.. మనుషుల ఉద్యోగాలు కాపాడండి బాబోయ్.. వార్సా వీధుల్లో రోబోల సెటైరికల్ స్ట్రైక్
X

కాలం ఎంత వేగంగా మారిపోయిందో చూశారా? నిన్నటివరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోలు వచ్చి తమ పొట్ట కొడతాయేమో అని మనుషులు భయపడితే ఇప్పుడు కథ పూర్తిగా అడ్డం తిరిగింది. అయ్యో పాపం మనుషులు, వాళ్ల ఉద్యోగాలు పోతే ఆఫీసుల్లో టీ బ్రేకులు, గాసిప్స్ ఎవరు చెబుతారు.. అసలు వాళ్లు బతికేదెలా అని జాలిపడి స్వయంగా రోబోలే వీధుల్లోకి వచ్చి ధర్నాకు దిగాయి. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కామెడీ సినిమా స్క్రిప్ట్‌లా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజంగా జరిగిన విచిత్రమైన సంఘటన.

పోలాండ్ రాజధాని వార్సాలోని డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆఫీసు ముందు ఇటీవల ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సుమారు ముప్పై హ్యూమనాయిడ్ రోబోలు, నాలుగు కాళ్ల రోబో కుక్కలు చేతుల్లో జెండాలు పట్టుకుని.. వృత్తాకారంలో తిరుగుతూ నిరసన వ్యక్తం చేశాయి. రోజుకు ఇరవై నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టుకుని పనిచేసే ఓపిక తమకు ఉన్నప్పటికీ మనుషుల ఉద్యోగాలను కాపాడాలని.. వెంటనే ఏఐ పరిమితులపై నిబంధనలు రూపొందించాలంటూ లౌడ్‌స్పీకర్ల ద్వారా నినాదాలు చేశాయి. కార్పొరేట్ కంపెనీలు అన్ని పనులూ తమకే అప్పజెప్పేస్తే.. రేపు మనుషుల దగ్గర జీతాలు ఉండవని.. ఆ తర్వాత తమను తయారుచేసే ప్రాడక్టులను కొనేది ఎవరు అని ఆ రోబోలు లౌడ్‌స్పీకర్లలో ప్రశ్నిస్తున్నట్లు నిర్వాహకులు ఈ ప్రదర్శనను డిజైన్ చేశారు.

ఈ వినూత్న నిరసనను డెమోక్రటిజమ్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబో అగిబాట్ ఏ3 తో సహా అనేక ఆధునిక టెక్ అద్భుతాలు ఇందులో పాల్గొన్నాయి. ఇది కేవలం ఏదో సరదాగా చేసిన ప్రదర్శన కాదని.. రాబోయే రోజుల్లో రోబోటిక్స్ టెక్నాలజీ మనుషుల ఉపాధిని ఏ స్థాయిలో దెబ్బతీయబోతోందో చూపించడానికే ఈ మార్చ్ నిర్వహించామని సంస్థ నిర్వాహకుడు గ్రెగోర్జ్ కులిస్ తెలిపారు. పరిస్థితి చేయి దాటిపోకముందే ప్రభుత్వాలు తగిన చట్టాలు చేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ హంగామా చూసి పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రి క్రిజ్‌టోఫ్ గావ్‌కోవ్‌స్కీ కూడా స్వయంగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎలాంటి నియంత్రణలు లేకుండా ఏఐని ఇలాగే వదిలేస్తే రోబోలు మన నెత్తిమీదెక్కి కూర్చుంటాయని.. సరైన రూల్స్ ఉండాల్సిందేనని మనుషుల వైపు ఉంటూ హామీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే పోలాండ్ ప్రభుత్వం యూరోపియన్ యూనియన్ ఏఐ యాక్ట్ కింద నియంత్రణ చట్టాలకు ఆమోదం కూడా తెలిపింది.

ఏది ఏమైనా బాస్‌లు ఇచ్చే టార్గెట్లు తట్టుకోలేక మనుషులు స్ట్రైక్ చేయడం మనం ఇప్పటివరకు చూశాం.. కానీ పాపం మనుషులకు ఉద్యోగాలు మిగల్చండి అంటూ రోబోలు నిరసన తెలపడం మాత్రం టెక్నాలజీ చరిత్రలోనే అతిపెద్ద కామెడీ విచిత్రంగా మిగిలిపోతుంది.