బ్యాడ్ న్యూస్ అంటూ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత తాజా హెచ్చరిక
ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని కొద్దిమంది రచయితల్లో ఒకరు రాబర్ట్ కియోసాకి. ఈ పేరు చదివినంతనే వెంటనే గుర్తుకు రాకపోతే.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత అన్నంతనే ఇట్టే గుర్తుకు వచ్చేస్తారు.
By: Garuda Media | 6 April 2026 7:00 AM ISTప్రపంచానికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని కొద్దిమంది రచయితల్లో ఒకరు రాబర్ట్ కియోసాకి. ఈ పేరు చదివినంతనే వెంటనే గుర్తుకు రాకపోతే.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత అన్నంతనే ఇట్టే గుర్తుకు వచ్చేస్తారు. గడిచినకొంతకాలంగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టుల ద్వారా ఆర్థిక క్రమశిక్షణతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. దాని కారణంగా ఏర్పడే పరిస్థితులతో పాటు.. ముప్పు.. ప్రమాదాలను హెచ్చరిస్తున్నారు.
కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా ఆ సమస్యల్ని అధిగమించేందుకు.. ప్రమాదాల్నితప్పించుకోవటానికి అవసరమైన సలహాల్ని.. సూచనల్ని సూటిగా.. సుత్తి కొట్టకుండా చేస్తున్నారు. తాజాగా అలాంటి పోస్ట్ మరొకటి పెట్టారు. ఇందులో తాజా ప్రపంచ పరిస్థితితో పాటు.. ఇప్పుడైతే ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న అంశాల్ని ప్రస్తావించారు.
‘2026 ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోంది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్నికీలక పరిణామాలే కారణం. బ్యాడ్ న్యూస్.. చరిత్ర రిపీట్ అయ్యింది’’ అంటూ తన ఆందోళనను వ్యక్తం చేశారు. 1974లో ప్రపంచంలో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణంగా ఆయన పేర్కొన్నారు. 1974 వరకు అమెరికా డాలర్ కు బంగారాన్ని హామీగా ఉంచేవారని.. ఆ ఏడాది నుంచి మాత్రం డాలర్ ను పెట్రో డాలర్ గా మారిన విషయాన్ని గుర్తు చేశారు.
బంగారం స్థానంలో చమురు డాలర్ కు వెన్నుముకగా మారింది. ఈ కారణంతోనే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగటంతో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోందని.. నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరినట్లుగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కోట్లాది మంది బేబీ బూమ ర్స్ (పెద్ద వయస్కులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బందులు పడబోతున్నారని చెప్పారు.
సోషల్ సెక్యూరిటీ.. మెడికేర్ లాంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని.. అందువల్ల లక్షలాది మంది పెద్ద వయస్కులు నిరాశ్రయులు అయ్యే ప్రమాదం ఉందన్నారు. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద రుణగ్రస్త దేశంగా మారిందన్న ఆయన.. పాఠశాలల్లో ఆర్థిక విద్య నేర్పకపోవటం ఈ దుస్థితికి కారణంగా పేర్కొన్నారు. ఇదంతా చెప్పి.. మిమ్మల్ని మీరు ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అనుసరించాల్సిన కొన్ని సూచనలు చేశారు.
- నిజమైన సంపదను పొదుపు చేయండి.
- కేవలం కాగితనపు కరెన్సీని నమ్ముకోకుండా బంగారం..వెండి.. బిట్ కాయిన్ లలో పెట్టుబడి పెట్టండి.
- యూట్యూబ్ లాంటి వేదికల్లో మంచి గురువులను ఎంపిక చేసుకొని డబ్బును ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోండి.
- ఈ సందర్భంగా మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.
- మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి.
