Begin typing your search above and press return to search.

మీకు కారుందా.. 'రోడ్ హిప్నోసిస్' తెలుసుకోండి.. ప్రమాదం తప్పుతుంది

-ప్రయాణం సందర్భంగా మన శరీర స్థితి ఎలా ఉందో తెలుసుకోకపోవడమే రోడ్ హిప్నోసిస్. దీనినే హైవే హిప్నోసిస్, వైట్ లైన్ ఫీవర్ గానూ పేర్కొంటుంటారు.

By:  Tupaki Desk   |   5 Jun 2025 5:00 AM IST
మీకు కారుందా.. రోడ్ హిప్నోసిస్ తెలుసుకోండి.. ప్రమాదం తప్పుతుంది
X

"ప్రపంచ యుద్ధాల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణాలే ఎక్కువ".. వినడానికి కఠినంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. చాలామంది ప్రముఖులు చెప్పే మాట. సీటు బెల్టు పెట్టుకోండి.. అతి వేగం వద్దు.. హెల్మెట్ వాడండి.. ఇలా ఎన్ని మాటలు చెప్పినా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. దీనికి కొందరు విధిరాతగా సమర్థించుకున్నా.. ముందు మనం జాగ్రత్తగా ఉండాలి కదా? రోడ్డు ప్రమాదాలకు మరో కారణం.. నిద్ర మత్తు. వాహనం తోలుతూనే ఒక్క తూలుగుతో జీవితం తలకిందులైన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఓ కోణాన్ని తాజాగా రాచకొండ పోలీసులు బయటపెట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో బాగా రద్దీగా ఉండేవి హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారులు. వీటిపై జరుగుతున్న ప్రమాదాల మీద రాచకొండ పోలీసులు అధ్యయనం సాగించారు. 'రోడ్ హిప్నోసిస్’ కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నట్లు తేల్చారు.

సెకను తూలితే జీవితం తలకిందులు..

వాహనం నడిపేటప్పుడు చాలామంది ఆ ఏముందిలే.. కాస్త నిద్ర మత్తే కదా? తోలుతూ పోతుంటే అదే పోతుందిలే అనుకుంటారు. కానీ, సెకను కన్ను మూత పడితే కన్నుమూతే అనేది గుర్తించడం లేదు. వాహనం తోలే వ్యక్తి కళ్లు-మెదడుకు అనుసంధానం కోల్పోతే (రోడ్ హిప్నోసిస్) ఇక చెప్పేదేముంది? దీంతోనే ఘోర ప్రమాదాలు జరుగుతున్నట్లు తేల్చారు.

-ప్రయాణం సందర్భంగా మన శరీర స్థితి ఎలా ఉందో తెలుసుకోకపోవడమే రోడ్ హిప్నోసిస్. దీనినే హైవే హిప్నోసిస్, వైట్ లైన్ ఫీవర్ గానూ పేర్కొంటుంటారు.

-వాహనం తోలడం మొదలుపెట్టాక రెండున్నర గంటల్లో సహజంగానే మనల్ని కాస్త నిస్సత్తువ ఆవహిస్తుంది. అప్పుడు కళ్లు తెరుచుకునే ఉంటాం కానీ.. మెదడు మాత్రం తనకు కనిపించేవాటిని రికార్డు చేయలేదు. ఈ క్రమంలో వాహనం నడిపే వ్యక్తి మిగతా వాహనాల వేగాన్ని అంచనా వేయలేడు. అందుకే ముందు వెళ్తున్నవాటిని, ఆగి ఉన్నవాటిని ఢీకొడుతుంటారు.

-రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా అర్ధరాత్రివేళలు, తెల్లవారుజామున జరుగుతుంటాయి. కారణం.. తోలేవారి నిద్ర మత్తు. వాహనాలు పెద్దగా లేక రోడ్లు ఖాళీగా ఉండడం, పొడుగ్గా ఉండే తెల్ల గీతలను చాలాసేపు చూస్తుండడం, అటుఇటు ఒకే తరహా సీనరీ.. వాహనంలోని మిగతావారు నిద్ర పోతుండడం, అలసట, డ్రైవర్ కు నిద్ర లేకపోవడంతో రోడ్ హిప్నోసిస్ బారినపడుతుంటారు.

ఇదీ నివారణ తీరు..

వాహనం తోలేవారు ప్రతి రెండు లేదా మూడు గంటలకు విరామం తీసుకోవాలి. వాహనం దిగి 2 నుంచి 6 నిమిషాలు అటుఇటు నడవాలి. అసలు సరైన నిద్ర లేకుంటే.. ప్రయాణమే మానుకోవడం ఉత్తమం. జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదనే విషయం గుర్తుంచుకోవడం ఇంకా ఉత్తమం.