Begin typing your search above and press return to search.

ఇంట్లో ఈగల మోత ఇంకెన్నాళ్లు రోజా?

అయితే.. మంత్రి రోజా కంటే ముందుగా వడమాల పేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ఆదివారం ఈ మూడు కార్యాలయాల్ని ప్రారంభించేయటం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 4:36 AM GMT
ఇంట్లో ఈగల మోత ఇంకెన్నాళ్లు రోజా?
X

ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత అన్న పాత సామెత ఏపీ మంత్రి ఆర్కే రోజాకు బాగా సూట్ అవుతుందంటున్నారు. కీలకమైన ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళలోనూ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ ఆమె తన సత్తా చాటలేకపోతున్నారు. టార్గెట్ చేసిన తన రాజకీయ ప్రత్యర్థుల్ని చులకనగా మాట్లాడే విషయంలో ఆర్కే రోజాకున్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైకు ముందు పెద్ద పెద్ద మాటలు బోలెడన్ని చెప్పే రోజా.. తన నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నట్లు అన్నది ప్రశ్న.

రాజకీయ ప్రత్యర్థుల సామర్థ్యం గురించి వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడే ఏపీ మంత్రి.. తన అడ్డాలో మాత్రం తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆమె నియోజకవర్గంలోని కొన్నిచోట్ల ఆమె రావటానికి ముందే ప్రారంభోత్సవాలు జరిగిపోవటం హాట్ టాపిక్ గా మారింది. మంత్రిగా వ్యవహరిస్తున్న ఆర్కే రోజాకు ఈ తరహా చేదు అనుభవాలు సొంత పార్టీ నేతల నుంచే ఉండటం ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలెట్ అంశంగా మారిందంటున్ానరు.

తాజాగా నగరి నియోజకవర్గంలోని వడమాల పేట మండలం అప్పలాయిగుంటలో సచివాలయం.. పత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్రం.. జగనన్న పాలసేకరణ కేంద్రాల్ని మంత్రి రోజా త్వరలో ఓపెన్ చేయాల్సి ఉంది. దీనికి మంచి ముహుర్తం కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే.. మంత్రి రోజా కంటే ముందుగా వడమాల పేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ఆదివారం ఈ మూడు కార్యాలయాల్ని ప్రారంభించేయటం సంచలనంగా మారింది.

గతంలోనూ పత్తిపుత్తూరులో సచివాలయ భవన ప్రారంభోత్సవానికి రోజా ఏర్పాట్లు చేసుకోగా.. బిల్లులు రాలేదని.. అవి వచ్చిన తర్వాతే ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలంటూ దానికి తాళం వేయటం.. ఈ అంశం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల జడ్పీ మీటింగ్ లోనూ జెడ్పీటీసీ సభ్యులు పలువురు మంత్రి రోజాకు వ్యతిరేకంగా నిరసన గళాల్ని వినిపించటం తెలిసిందే.

అంతేకాదు.. ఆమెకు కానీ టికెట్ ప్రకటిస్తే తాము ఓడిస్తామంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఇంతకీ ఈ రచ్చ అంతా ఎందుకన్న విషయంలోకి వెళితే.. నగరి నియోజకవర్గంలో బలమైన నేతలుగా ఉన్న పలువురిని రోజా దూరం పెట్టటమే కారణమని చెబుతున్నారు. మంత్రి హోదాలో ఉండి.. నిత్యం విపక్ష నేతలకు సలహాలు ఇచ్చే ఆమె.. తన సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలతో ఉన్న విభేదాల్ని పరిష్కరించుకోవటం.. అందరిని ఒకే తాటి మీదకు తీసుకొచ్చే విషయంలో అడ్డంగా ఫెయిల్ అయ్యారు. దీంతో.. ఇలాంటి చేదు అనుభవాలు మంత్రి రోజాకు తరచూ ఎదురవుతున్న పరిస్థితి. ఇంట్లో ఈగల మోత అన్న సామెతకు ఆర్కే రోజా పరిస్థితి పర్ ఫెక్టుగా సూట్ అవుతుంది కదూ?