Begin typing your search above and press return to search.

పడిపోతున్న రిషి సునాక్ పాపులార్టీ.. కారణం ఇదేనా?

ప్రతికూల పరిస్థితుల్లో అధికారాన్ని సొంతం చేసుకున్న రిషి.. పాలనా రథాన్ని లాగటంలో అవస్థలకు గురవుతున్నారు.

By:  Tupaki Desk   |   14 Dec 2023 4:30 AM GMT
పడిపోతున్న రిషి సునాక్ పాపులార్టీ.. కారణం ఇదేనా?
X

భారత సంతతికి చెందిన వ్యక్తి.. మనల్ని వందల ఏళ్లు పాలించిన బ్రిటిష్ రాజ్యానికి ప్రధానమంత్రి కావటమా? రిషి సునాక్ కు ముందు వరకు ఇలాంటి మాటలు ఎవరైనా చెబితే.. అస్సలంటే అస్సలు సాధ్యమే కాదని చెప్పేవారు. కానీ.. ప్రపంచంలో.. అందునా రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదన్న విషయాన్ని రిషి సునాక్ ఎపిసోడ్ తో అర్థమైందని చెప్పాలి. పాలనా పగ్గాల్ని చేపట్టిన రిషికి.. పాపులార్టీ విషయంలో అంతకంతకూ ఎదురుగాలి వీస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో అధికారాన్ని సొంతం చేసుకున్న రిషి.. పాలనా రథాన్ని లాగటంలో అవస్థలకు గురవుతున్నారు.

తాజాగా ఆయన ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రిషి సునాక్ పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బ తీసిందని.. దీంతో ఆయన రేటింగ్ పడిపోయినట్లుగా తాజాగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. దేశ ప్రధానిగా రిషి వద్దంటూ బ్రిటన్ లోని 70 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లుగా తాజా రిపోర్టు స్పష్టం చేసింది. యుగోవ్ లో ప్రచురించిన ఒక సర్వే ప్రకారం 21 శాతం మంది మాత్రమే రిషిని యూకే ప్రధానిగా ఆమోదిస్తున్నట్లుగా వెల్లడించింది.

గడిచిన నెలలో ఆయనకున్న ప్రజాదరణ మరింత తగ్గినట్లుగా తేల్చారు. దీనికి కారణం.. యూకేకు వలస వచ్చే వారిని రువాండాకు తరలించాలని రిషి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇది కాస్తా వివాదాస్పదమైంది. ఈ అంశం తాజాగా జరిపిన సర్వేపై ప్రభావం చూపినట్లుగా చెబుతున్నారు. కొద్ది వారాల క్రితం చేసిన సర్వేలో ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో కాస్తంత సానుకూలత ఎదురైంది. శీతాకాల బడ్జెట్ లో కొన్ని రకాల పన్నుల్ని తగ్గించనున్నట్లుగా తీసుకున్న నిర్ణయం సానుకూలత వ్యక్తమైతే.. తాజాగా తీసుకున్న రాజకీయ నిర్ణయం ఆయన ఇమేజ్ ను మరింత తగ్గేలా చేసినట్లు చెబుతున్నారు.