Begin typing your search above and press return to search.

గ్రీన్ జోన్ లో ఆరుగురు? కూటమిలో మంత్రుల ప్రొగ్రెస్

అయితే ఈ ఏడాదిలో కూటమి ప్రజలు కోరుకున్నట్లు పాలించిందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కుతూహలం చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 4:00 AM IST
గ్రీన్ జోన్ లో ఆరుగురు? కూటమిలో మంత్రుల ప్రొగ్రెస్
X

ఏడాది కూటమి పాలనపై సర్వే ఏజెన్సీలు వరుసగా తమ నివేదికలు సమర్పిస్తున్నాయి. గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో విజయం దక్కించుకోవడంతో కూటమి పాలనపై ప్రజల్లో ఎక్కువ ఆసక్తి చూపుతోంది. అయితే ఈ ఏడాదిలో కూటమి ప్రజలు కోరుకున్నట్లు పాలించిందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కుతూహలం చూపిస్తున్నారు. అందుకే చాలా ప్రైవేటు ఏజెన్సీలు ఏపీలో సర్వేల పేరుతో హడావుడి చేస్తున్నాయి.

గత ఎన్నికల్లో సర్వేలు వెలువరించిన చాలా సంస్థలు ఓటర్ల నాడి పట్టుకోవడంలో విఫలమయ్యాయి. అయితే కొన్ని సంస్థలు వేసిన అంచనాలు కచ్చితమయ్యాయి. దీంతో ఏడాది పాలనపైనా సర్వేలు చేశామంటూ కొన్ని సంస్థలు మళ్లీ హడావుడి చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఆరా తీసినట్లు వెల్లడిస్తున్నాయి. అయితే కూటమి పాలనకు మంచి మార్కులు వేస్తున్న ఏజెన్సీలు, ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్నట్లు చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే రైజ్ అనే సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలు కూడా ఆసక్తికరంగా మారాయి. కూటమి పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించిన రైజ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారులో ఉన్న 25 మంది మంత్రుల పనితీరుపైనా ఆరా తీసినట్లు ప్రకటించింది. రైజ్ ఇచ్చిన సమాచారాన్ని యూట్యూబ్ చానళ్లలో కొందరు విశ్లేషించడం వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గంలో ప్రస్తుతం 24 మంది ఉన్నారు. సీఎంతో కలపుకుంటే ఈ సంఖ్య 25కు చేరుతుంది.దీంతో మొత్తం మంత్రివర్గ పనితీరుపైరైజ్ ఆరా తీసింది.

సీఎం చంద్రబాబు పనితీరుపై ప్రజలు ఎక్కువ సంతృప్తిగా ఉన్నారని ఆ సర్వే వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరో ఐదుగురు తమ పనితీరుతో గ్రీన్ జోనులో సేఫ్ గా ఉన్నారని అంటున్నారు. వీరి పనితీరుపై ప్రజల్లోనూ ఆనందం వ్యక్తమవుతోందని అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువనేత లోకేశ్, ఆర్థిక మంత్రి కేశవ్, జలవనరుల మంత్రి రామానాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ తమ విధినిర్వహణలో సక్సెస్ అయ్యారని ఆ సర్వే నివేదిక వెల్లడించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రివర్గంలో మొత్తం 25 మంది సభ్యులు ఉండగా, కేవలం ఆరుగురు మాత్రమే గ్రీన్ జోన్ లో ఉన్నట్లు రైజ్ వెల్లడించింది. ఇక రెడ్ జోన్ లో మొత్తం 10 ఉండగా, వారిలో కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కొలుసు పార్థసారిధి, గొట్టిపాటి రవి, స్వామి, సవిత, రాంప్రసాద్ రెడ్డి, సుభాష్ పేర్లను చేర్చింది. మిగిలిన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి, నాదెండ్ల మనోమర్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, రామనారాయణరెడ్డి, దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్ పనితీరుపై ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు నివేదించింది.

అంటే దాదాపు 19 మంది మంత్రులు అనుకున్న స్థాయిలో రాణించడం లేదని సర్వే నివేదిక వెల్లడిస్తోంది. చంద్రబాబు, పవన్, లోకేశ్ పోటాపోటీగా పనిచేస్తున్నారు. తమతోపాటు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. కానీ, చాలా మంది మంత్రులు సరిగా పనిచేయడం లేదని సీఎం చంద్రబాబు కూడా అసంతృప్తిగా ఉన్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే చాలా మంది పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సర్వే నివేదికలు కూడా ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడం సంచలనంగా మారింది.