Begin typing your search above and press return to search.

వాలంటీర్లకు ఇక శుభం కార్డు...వైసీపీ సైతం !

వాలంటీర్ వ్యవస్థకు నారు నీరు పోసింది వైసీపీ ప్రభుత్వమే. ఒక విధంగా జగన్ మానస పుత్రికగా ఈ వ్యవస్థను చూడాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   2 Jun 2025 3:53 AM
The Rise and Fall of APs Volunteer System
X

వాలంటీర్ వ్యవస్థకు నారు నీరు పోసింది వైసీపీ ప్రభుత్వమే. ఒక విధంగా జగన్ మానస పుత్రికగా ఈ వ్యవస్థను చూడాల్సి ఉంది. అయిదేళ్ళ పాటు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం పోషించింది. ఒక్కొక్కరికీ అయిదు వేల రూపాయలను ప్రతీ నెలా గౌరవ వేతనంగా చెల్లించింది.

అలా ప్రతీ యాభై ఇళ్ళకు వాలంటీర్ ని ఒకరిని నియమించి వారికి ఇంటి వద్దనే పౌర సేవలను అందించాలని చూసింది. ఒక విధంగా ఈ ప్రయత్నం మంచిదే అయినా రాజకీయ జోక్యం పెరగడం వాలంటీర్లను వైసీపీ నేతలు సొంతం చేసుకోవడం అలా వారి మీద బలమైన రాజకీయ ముద్ర పడడంతో చివరికి ఆ వ్యవస్థకే ముప్పుగా మారింది.

మరో వైపు వారి మీద గంపెడు ఆశలు పెట్టుకుని వైసీపీ అధినాయకత్వం కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాంతో వారు 2024 ఎన్నికల నాటికి చేతులెత్తేశారు. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంతో వైసీపీ రెండిందాలా చెడింది. ఫలితంగా 11 సీట్లతో ఘోర ఓటమిని అందుకుంది.

ఈ నేపధ్యంలో గత ఏడాదిగా చూస్తే వాలంటీర్ల ఊసే వైసీపీ ఎత్తడం మానేసింది. అధికార కూటమి మీద విమర్శలు చేయడానికి మాత్రమే వాలంటీర్లను రోడ్డున పడేశారు అని ఆరోపిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది కానీ వాలంటీర్లను తిరిగి విధులలోకి తీసుకునే ప్రయత్నం ఏమీ చేయడం లేదు.

ఎన్నికల వేళ వారికి పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పింది కానీ తీరా అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు అసలు విధులలోనే లేరని వారి సేవలను 2023 ఆగస్టు నుంచి వైసీపీ ప్రభుత్వం రెన్యూవల్ చేయలేదని టెక్నికల్ రీజన్స్ చెబుతూ వారిని పూర్తిగా పక్కకు పెట్టేసింది. తప్పు అంతా వైసీపీ మీదకే తోసేసింది.

దాంతో వాలంటీర్లు ఉద్యమించారు కానీ ఫలితం అయితే దక్కడం లేదు. వైసీపీ వైపు నుంచి చూస్తే తాము అయిదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి అయిదేళ్ళ పాటు ఉపాధి కల్పించినా వాలంటీర్లు కూటమి ఇచ్చిన పది వేల రూపాయల హామీకు ఆశ పడి ఎన్నికల్లో తమకు దెబ్బ కొట్టారు అన్న ఆగ్రహం ఉంది. దాంతో వాలంటీర్ల విషయంలో లైట్ తీసుకుంటోంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే జగన్ 2.ఓలో పూర్తిగా కార్యకర్తలకే అంకితం అయ్యేలా పాలన ఉంటుందని జగన్ పలు మార్లు స్పష్టం చేశారు. ఈ దశలో వాలంటీర్ల ఊసు కనుక తెస్తే వైసీపీ క్యాడర్ నమ్మే సీన్ ఉండదని కూడా ఆలోచించి మరీ వైసీపీ వాలంటీర్లను దూరం పెడుతోంది అని అంటున్నారు.

మొత్తానికి ఎవరి అవసరాలు ఎవరి రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా కూడా మధ్యలో పడి నలిగింది వాలంటీర్లే అని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే వాలంటీర్ల వ్యవస్థకు పూర్తిగా శుభం కార్డు పడినట్లే అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా తాము చెప్పిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే అందులో వాలంటీర్ల ప్రస్తావన అయితే లేదు. దాంతో వాలంటీర్లకు శుభం కార్డు పూర్తిగా పడిపోయినట్లే అని అంటున్నారు. మొత్తానికి ఎంతో ఆర్భాటంగా వినూత్నంగా మొదలైన ఒక వ్యవస్థ చివరికి పుబ్బలో పుట్టి మఖలో మాడిన చందమైనది అని అంటున్నారు.