Begin typing your search above and press return to search.

ఏఐ జిమ్స్ వచ్చేశాయి.. ఇవి ఎలా పని చేస్తాయంటే..?

ఇప్పటి వరకు జిమ్‌కు వెళ్తే ట్రెయినర్ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఎంత బరువు ఎత్తాలి, ఎంత వేగంతో పరుగెత్తాలి, ఎన్ని సెట్‌లు చేయాలి అన్నది ఆయన చెప్పేదే ఫైనల్. కానీ ఏఐ జిమ్స్‌లో ఆ పాత్రను ఇప్పుడు స్మార్ట్ మెషీన్లు పోషిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 Dec 2025 6:17 PM IST
ఏఐ జిమ్స్ వచ్చేశాయి.. ఇవి ఎలా పని చేస్తాయంటే..?
X

హాయిగా, సంతోషంగా జీవించాలంటే డబ్బు ఒక్కటే సరిపోదు.. ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఉండాలంటే ఆహారం మాత్రమే కాదు, శరీరానికి క్రమమైన కసరత్తు అవసరం. కానీ బిజీ జీవితం, ఒత్తిడి, స్క్రీన్‌ ముందు గడిచే గంటలు మన శరీరాన్ని నెమ్మదిగా అలసట వైపు నడిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని ముందే గ్రహించిన యువత, ఇప్పుడు ఫిట్‌నెస్‌ను లగ్జరీగా కాకుండా అవసరంగా చూస్తోంది. అదే సమయంలో టెక్నాలజీ కూడా మన అడుగులకు అడుగు కలుపుతూ కొత్త దారులు చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిట్‌నెస్ ప్రపంచంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించింది. ఫలితంగా.. సంప్రదాయ జిమ్‌లకు భిన్నంగా ‘ఏఐ జిమ్స్’ అనే కొత్త అధ్యాయం తెరపైకి వచ్చింది.





ట్రైనర్ పై ప్రత్యేకంగా ఆధారపడాల్సిన అవసరం లేదు..

ఇప్పటి వరకు జిమ్‌కు వెళ్తే ట్రెయినర్ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఎంత బరువు ఎత్తాలి, ఎంత వేగంతో పరుగెత్తాలి, ఎన్ని సెట్‌లు చేయాలి అన్నది ఆయన చెప్పేదే ఫైనల్. కానీ ఏఐ జిమ్స్‌లో ఆ పాత్రను ఇప్పుడు స్మార్ట్ మెషీన్లు పోషిస్తున్నాయి. ఒక్కసారి లాగిన్ అయితే చాలు.. మీ వయసు, బరువు, ఎత్తు, హార్ట్‌రేట్, గతంలో చేసిన వర్కౌట్స్ అన్నీ విశ్లేషించి, మీ శరీరానికి ఏ వ్యాయామం ఎంత అవసరమో మెషీన్‌ నిర్ణయిస్తుంది. ఇది కేవలం సూచనలు ఇవ్వడమే కాదు.. మీరు చేసే ప్రతి కదలికను గమనిస్తూ, తప్పులు చేస్తే వెంటనే సరిదిద్దుతుంది.





ప్రతి ఒక్కటి క్యాలిక్యుయేషన్ ప్రకారమే

ట్రెడ్‌మిల్ మీద పరుగెత్తేటప్పుడు గుండె కొట్టుకునే వేగం ఎక్కువైతే, మనకు తెలియకుండానే స్పీడ్ తగ్గించేది ఇప్పుడు ఏఐ. వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు సరైన పొజిషన్‌లో లేకపోతే, స్క్రీన్ మీద వెంటనే అలర్ట్ ఇస్తుంది. ‘అలా కాదు.. ఇలా చేయాలి’ అంటూ డిజిటల్ ట్రెయినర్ చూపిస్తుంది. రోయింగ్ మెషీన్స్, స్మార్ట్ డంబెల్స్, అడ్జస్టబుల్ వెయిట్స్.. అన్నీ ఇప్పుడు మన శరీరానికి తగ్గట్టు తామే మారిపోతున్నాయి. మనం ఎంత శ్రమిస్తున్నాం, ఎంత శక్తి ఖర్చవుతోంది, ఎంత కాలరీలు బర్న్ అవుతున్నాయో రియల్ టైమ్‌లో మన ముందే కనిపిస్తుంది.





బోర్ కొట్టకుండా ఏం చేస్తున్నాయంటే?

ఇక్కడ మరో ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే.. జిమ్ అనేది ఇక కేవలం చెమటోడ్చే ప్రదేశం మాత్రమే కాదు. ఇది ఒక ఇంటరాక్టివ్ అనుభూతిగా మారుతోంది. ఫిట్‌నెస్ మిర్రర్లు, వర్చువల్ ట్రెయినర్లు, స్క్రీన్ బేస్డ్ గైడెన్స్.. ఇవన్నీ కలసి వ్యాయామాన్ని బోర్ కాకుండా మార్చుతున్నాయి. ఒంటరిగా ఉన్నా, ఎవరో ఒకరు మనతో పాటు ఉన్నట్టే అనిపించేలా ఈ టెక్నాలజీ పనిచేస్తోంది. కొందరికి అయితే వర్చువల్ రియాలిటీ ట్రెయినర్లతో వర్కౌట్ చేసే అవకాశం కూడా లభిస్తోంది.





విదేశాలలో కొనసాగుతున్న ట్రెండ్..

ఈ ట్రెండ్ విదేశాల్లో ఇప్పటికే బలంగా నిలిచింది. అమెరికా, కెనడా, జపాన్, దుబాయ్ లాంటి దేశాల్లో ఏఐ జిమ్స్ సాధారణ విషయమే. ఇప్పుడు అదే మార్పు మన దేశంలోనూ మొదలైంది. హైదరాబాద్ వంటి నగరాల్లో ఏఐ ఆధారిత జిమ్ సెంటర్లు తెరుచుకుంటున్నాయి. ట్రెయినర్ పక్కన లేకపోయినా, ఎలాంటి అయోమయం లేకుండా మనమే సొంతంగా వ్యాయామం చేసుకునే స్థాయికి ఈ జిమ్స్ తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా యువతతో పాటు వయసు మీద పడుతున్నవారికి కూడా ఇది సేఫ్ ఆప్షన్‌గా మారుతోంది.

ట్రైనర్ అవసరమే!

అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏఐ వచ్చిందని మానవ ట్రెయినర్ల అవసరం పూర్తిగా తీరిపోతుందా? సమాధానం అంత సింపుల్ కాదు. ఏఐ డేటాను విశ్లేషించగలదు, ప్యాటర్న్స్ గుర్తించగలదు. కానీ మనిషి ఇచ్చే ప్రోత్సాహం, మాటల ద్వారా వచ్చే మోటివేషన్, వ్యక్తిగత అనుభూతిని పూర్తిగా భర్తీ చేయలేరు. అందుకే రాబోయే రోజుల్లో ఏఐ, హ్యూమన్ ట్రెయినర్ అనే కలయికే ఫిట్‌నెస్ రంగాన్ని ముందుకు నడిపించే అవకాశం ఉంది.

మొత్తానికి ఏఐ జిమ్స్ మనకు చెప్పేది ఒక్కటే. ఫిట్‌నెస్ కూడా ఇప్పుడు స్మార్ట్ అయింది. శరీరాన్ని చూసుకోవడం ఇక అంచనాలతో కాదు.. డేటాతో, టెక్నాలజీతో. ‘ఏఐతో కానిదేముంది’ అనే మాట జిమ్ గోడల మధ్య కూడా నిజమవుతోంది. మనం మారితే.. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు కూడా మనతో పాటు మారుతున్నాయి.