Begin typing your search above and press return to search.

ఈ ఏడాది రింకూ సింగ్ జీవితంలో 4 విషాద క్షణాలు.. వారం రోజుల్లోనే ఇంత నరకమా?

ఫిబ్రవరి 26న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్‌ను ప్లేయింగ్ 11 నుంచి తప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

By:  Madhu Reddy   |   27 Feb 2026 12:38 PM IST
ఈ ఏడాది రింకూ సింగ్ జీవితంలో 4 విషాద క్షణాలు.. వారం రోజుల్లోనే ఇంత నరకమా?
X

టీమ్ ఇండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే ఈ యోధుడు, వ్యక్తిగత జీవితంలో తీరని వేదనను అనుభవిస్తున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే ఒక క్రికెటర్‌గా, ఒక కొడుకుగా రింకూ ఎదుర్కొన్న పరిస్థితులు ఎవరినైనా కలిచివేస్తాయి. తండ్రి మరణం ఒక ఎత్తయితే, జట్టు యాజమాన్యం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

తండ్రి ప్రేమకు, దేశ బాధ్యతకు:

రింకూ సింగ్ తండ్రి ఖాంచంద్ర సింగ్ గత కొంతకాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఫిబ్రవరి 24న తన తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తెలిసి రింకూ ఆయన్ని చూడటానికి వెళ్ళాడు. అయితే, దేశం కోసం ఆడాలనే పిలుపు రావడంతో ఫిబ్రవరి 25న తిరిగి టీమ్ ఇండియాలో చేరాడు. ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రి, మరోవైపు దేశం కోసం ఆడాల్సిన బాధ్యత.. ఈ రెండింటి మధ్య ఆ యువ ఆటగాడు ఎంత నరకాన్ని అనుభవించి ఉంటాడో ఊహించుకుంటేనే బాధేస్తుంది. తండ్రి దీవించి పంపారో లేదో కానీ, రింకూ మాత్రం భారమైన హృదయంతోనే మైదానంలోకి అడుగుపెట్టాడు.

మేనేజ్‌మెంట్ వైఫల్యం:

ఫిబ్రవరి 26న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్‌ను ప్లేయింగ్ 11 నుంచి తప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక ఆటగాడి ఇంట్లో అంత పెద్ద విపత్తు జరుగుతున్నప్పుడు, కనీసం ఆడనివ్వాలనే ఆలోచన లేనప్పుడు ఆయన్ని ఎందుకు పిలిపించారనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఇక తండ్రిని చివరి క్షణాల్లో చూసుకునే అవకాశం కూడా లేకుండా చేసి, తీరా మ్యాచ్ సమయంలో బెంచీకే పరిమితం చేయడం నిజంగా దారుణం. రింకూ లాంటి మ్యాచ్ విన్నర్‌కు జట్టులో చోటు దక్కకపోవడం ఒకెత్తయితే, ఇలాంటి క్లిష్ట సమయంలో ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం మేనేజ్‌మెంట్ వైఫల్యమే అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

రింకూకు తీరని లోటు:

చివరికి ఫిబ్రవరి 27న రింకూ తండ్రి ఖాంచంద్ర సింగ్ గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. రింకూను ఈ స్థాయికి చేర్చడానికి ఎంతో కష్టపడిన ఆ తండ్రి, కొడుకు టీమ్ ఇండియా జెర్సీలో ఉండగానే సెలవు తీసుకోవడం విషాదకరం. ఇక వారం రోజుల్లోనే తండ్రి ఆరోగ్యం క్షీణించడం, జట్టులోకి పిలుపు రావడం, అక్కడ అవకాశం దక్కకపోవడం, చివరకు తండ్రిని కోల్పోవడం.. ఇవన్నీ చూస్తుంటే రింకూకు ఈ ఏడాది ఒక తీరని పీడకలలా మిగిలిపోయింది. ఈ కష్ట సమయంలో రింకూకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.