క్రికెటర్ రింకూ సింగ్ పై వేటు వేసిన ఎన్నికల సంఘం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుసగా ఐదు సిక్సులు కొట్టి మ్యాచ్ గెలిపించి.. అటునుంచి అటే భారత జట్టులోకి వచ్చాడు రింకూ సింగ్.
By: Tupaki Desk | 2 Aug 2025 7:00 PM ISTటీమ్ ఇండియా డాషింగ్ బ్యాట్స్ మన్ రింకూ సింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది..! అదేంటి...? ఒక జాతీయ క్రికెటర్ పై చర్యలు తీసుకోవాల్సింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కదా..? మరి ఎన్నికల సంఘానికి ఏం సంబంధం అంటారా? దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది..
ఐదుసిక్సుల వీరుడు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుసగా ఐదు సిక్సులు కొట్టి మ్యాచ్ గెలిపించి.. అటునుంచి అటే భారత జట్టులోకి వచ్చాడు రింకూ సింగ్. టి20ల్లో లోయరార్డర్ లో ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. అటు ఐపీఎల్ లోనూ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు మంచి విజయాలు అందిస్తూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. నిరుడు జరిగిన మెగా వేలంలో కేకేఆర్ అతడిని రూ.13 కోట్లకు అట్టిపెట్టుకుంది. కేవలం రూ.లక్షల నుంచి మొదలైన అతడి ప్రస్థాన ఇప్పుడు రూ.13 కోట్లకు చేరడం గమనార్హం.
రూ.3 కోట్ల విల్లాకు ఓనరు...
ఒకనాడు గ్యాస్ డెలివరీ ఏజెంట్ అయిన తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న రింకూ జీవితంలో స్థిరపడేందుకు చాలా పనులు చేశాడు. అయినప్పటికీ క్రికెట్ ను మాత్రం వదల్లేదు. అదే అతడి జీవితాన్ని మార్చింది. ఇప్పుడు రింకూ రూ.3 కోట్లకు పైగా విలువచేసే విల్లాలో జీవిస్తున్నాడు. అందులో తాను ఐదు సిక్సులు కొట్టిన బ్యాట్ కు ప్రత్యేక ప్రదేశం కల్పించాడు.
ఎంపీ గారికి కాబోయే భర్త..
యూపీకి చెందిన రింకూ సింగ్ త్వరలో ఎంపీ ప్రియా సరోజ్ ను వివాహం చేసుకోనున్నాడు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగింది. ప్రియా సరోజ్ తొలిసారి ఎంపీ. అక్కడి ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ కి చెందినవారు. కాగా, పేద ఇంటి నుంచి వచ్చిన రింకూను గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు చైతన్యం కార్యక్రమం స్వీప్ నకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. అయితే, ఎంపీ ప్రియా సరోజ్ తో వివాహం నేపథ్యంలో అతడిని ఈ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పించింది. నిష్పాక్షికత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
