Begin typing your search above and press return to search.

కేరళలో రాహుల్ విజయన్ మాటల యుద్దం

కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఢిల్లీలో కుస్తీ పడుతూ గల్లీలో దోస్తీ చేస్తున్నారని తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు తరచూ విమర్శలు చేస్తుంటారు

By:  Tupaki Desk   |   21 April 2024 9:29 AM GMT
కేరళలో రాహుల్ విజయన్ మాటల యుద్దం
X

కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఢిల్లీలో కుస్తీ పడుతూ గల్లీలో దోస్తీ చేస్తున్నారని తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు తరచూ విమర్శలు చేస్తుంటారు. పలు ఉప ఎన్నికలతో పాటు, గత లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఓట్ల బదలాయింపు మూలంగా ఈ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే మాదిరిగా ఇండియా కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య కేరళలో పేలుతున్న మాటల తూటాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ, కేరళ కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్దం ఎక్కడికి దారితీస్తుందో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

‘‘సీఎం పినరయి విజయన్‌ను ఈడీ, సీబీఐలు ఎందుకు ప్రశ్నించడం లేదు’’అని రాహుల్ విమర్శించగా, ‘‘సీఎం విజయన్ బీజేపీతో రాజీపడ్డారని, అందుకే ఆయన బీజేపీని వదిలేసి రాహుల్ మీద విరుచుకుపడుతున్నారని, పలు కుంభకోణాలు, బంగారం స్మగ్లిం గ్‌ వంటి తీవ్ర కేసుల్లో విజయన్‌ పేరు వెలుగుచూసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయన విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని’’ పతనంతిట్ట ఎన్నికల ప్రచారంలో రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ విమర్శించారు.

అయితే రాహుల్ వ్యాఖ్యలకు విజయన్ తీవ్రంగానే స్పందించాడు. ‘‘కమ్యూనిస్టులకు జైలుకు వెళ్లడం కొత్త కాదు. మీ నాన్నమ్మ ఇందిరాగాంధీ ఎంతో మంది కమ్యూనిస్టులను ఏడాదిన్నరకు పైగా జైలులో బంధించింది. అయినా మా వాళ్లు మీ కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మాదిరిగా భయపడి ఏడవం’’ అని ఘాటుగా బదులిచ్చారు. గతంలో మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంపై రాహుల్ మాట్లాడుతూ ‘‘జైలుకు వెళ్లాల్సి వస్తుందని అశోక్ చవాన్ భయపడ్డారు. మా అమ్మ ముందు కన్నీరు పెట్టుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు. వాటిని ఉదాహారిస్తూ విజయన్ కౌంటర్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

గత ఎన్నికలలో యూపీలోని అమేథీ, కేరళలోని వాయనాడ్ ల నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీ అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55,120 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వాయనాడ్ లో 4,31,770 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. అయితే ఈ ఎన్నికలలో గత ఎన్నికల మాదిరిగా ఇక్కడ రాహుల్ కు సానుకూలత లేదని తెలుస్తున్నది. సీపీఐ నాయకురాలు అన్నీ రాజా నుండి రాహుల్ కు తీవ్ర పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో రాహుల్ ఇలా ఘాటుగా స్పందిస్తున్నారని సమాచారం.