Begin typing your search above and press return to search.

ఇంతకూ చంద్రుడిపై ఉన్న వనరులపై హక్కు ఏ దేశానికి?

జాబిల్లి ఏ ఒక్కరిదో కాదని.. ఇది మొత్తం ప్రపంచ మానవాళికి చెందిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 8:22 AM GMT
ఇంతకూ చంద్రుడిపై ఉన్న వనరులపై హక్కు ఏ దేశానికి?
X

భూమికి దగ్గరగా కనిపించే ఉపగ్రహం చంద్రుడిపై మానవాళి ఆసక్తి ఇప్పటిది కాదు. భారతీయ పురాణాల్లో, జానపద కథల్లో చంద్రుడికి సంబంధించి చాలా కథలు, గాథలు ఉన్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో భూమికి ఎలాంటి విపత్తు అయినా సంభవిస్తే సురక్షిత గమ్యస్థానంగా చంద్రుడిని మార్చుకోవాలన్న ఆలోచనలు మానవాళికి ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నో దేశాలు చంద్రుడి గుట్లుమట్లను తెలుసుకునేందు రాకెట్లను పంపాయి. అయితే ఇందులో నాలుగు దేశాలే ఇప్పటివరకు విజయం సాధించాయి. అమెరికా, రష్యా, చైనా, భారత్‌ మాత్రమే చంద్రుడిపైన ల్యాండర్‌ ను దించగలిగాయి. ఇక భారత్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ ను దించిన ఏకైక దేశంగా రికార్డులు సృష్టించింది.

ఈ నేపథ్యంలో చంద్రుడిపై అసలు ఏమున్నాయి? అనేది చర్చకు వస్తోంది. జాబిల్లిపై పెద్ద మొత్తంలో హీలియం, మంచు రూపంలో నీరు, సిలికాన్, అల్యూమినియం వంటివి కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయని అంటున్నారు. మరి ఈ వనరులపై గుత్తాధిపత్యం ఎవరికి దక్కుతుంది? వీటి కోసమూ దేశాల మధ్య యుద్ధాలు తప్పవా అనేది ఆసక్తి రేపుతోంది.

అయితే చందమామకు సంబంధించి అంతర్జాతీయ చట్టాలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. జాబిల్లి ఏ ఒక్కరిదో కాదని.. ఇది మొత్తం ప్రపంచ మానవాళికి చెందిందని అంటున్నారు.

చంద్రుడిపై హిమం రూపంలో నీరు వంటి విలువైన వనరులు ఉన్నట్లు అంచనా. భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌–1 చంద్రుడిపై నీటి జాడలను కనిపెట్టింది. జీవుల మనుగడకు నీరు అత్యంత ప్రధానమనే విషయం తెలిసిందే. కేవలం జీవుల మనుగడకే కాకుండా ఆక్సిజన్, తాగునీరు, హైడ్రోజన్‌ లాంటి రాకెట్‌ ఇంధనం వంటివి ఉత్పత్తి చేయడానికి కూడా వీలు కలుగుతుందని పేర్కొంటున్నారు. వీటితో సుస్థిర, చౌకైన పద్ధతిలో ఖగోళాన్వేషణలు చేసే వీలు కూడా ఉంటుందని చెబుతున్నారు.

కాగా అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి 1966లో ఐక్యరాజ్యసమితి.. బాహ్య అంతరిక్ష ఒప్పందాన్ని తెచ్చింది. దీని ప్రకారం.. చందమామ, ఇతర ఖగోళ వస్తువులపై ఏ దేశమూ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు. ఏ దేశం ప్రయోగాలు చేసినా అన్ని దేశాల ప్రయోజనం కోసమే ఖగోళ అన్వేషణలు ఉండాలి. అయితే ఈ ఒప్పందంలో కేవలం ప్రభుత్వాల ప్రస్తావనే ఉందని తెలుస్తోంది. చందమామలోని ఏదైనా ప్రాంతంపై హక్కులను ఆయా దేశాలు ప్రకటించుకోవచ్చా అనేదానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం.

ఇక 1979లో మూన్‌ అగ్రిమెంట్‌ వచ్చింది. దీని ప్రకారం.. ఏ ప్రభుత్వం, అంతర్జాతీయ, ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు చందమామను తమ ఆస్తిగా ప్రకటించుకోవడానికి వీల్లేదు. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని, జాబిల్లి మాదే అనడం కూడా కుదరదు. చంద్రుడితోపాటు దానిపైన ఉన్న సహజవనరులు కూడా మానవాళికి ఉమ్మడి సొత్తుగా ఉంటాయి. ఈ ఒప్పందం 1984లో అమల్లోకి రాగా చంద్రుడిపైకి ల్యాండర్లు పంపిన మూడు దేశాలు (ఇండియా మినహాయించి) అమెరికా, రష్యా, చైనా ఇంకా ఈ ఒప్పందాన్ని ఆమోదించకపోవడం గమనార్హం.

అలాగే అంతరిక్ష ఒప్పందాలకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా 2020లో అర్టెమిస్‌ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. చందమామపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టడం దీని ప్రధాన లక్ష్యం. ఇందులో కెనడా, జపాన్, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతోపాటు తదితర దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. భారత్‌ కూడా ఇటీవల ఇందులో సభ్యురాలిగా చేరింది.

మరోవైపు ఇప్పటికే చంద్రుడి ఉపరితలం నుంచి ఆక్సిజన్, ఇనుము, సిలికాన్, అల్యూమినియం వెలికితీసి, వాటి నుంచి సోలార్‌ సెల్స్, వైర్‌ ఉత్పత్తి చేయడానికి బ్లూ ఆరిజిన్‌ కంపెనీని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా ఎంపిక చేసింది.

అదేవిధంగా జాబిల్లిపై శిలలను తొలగించడానికి, ఒదులుగా ఉండే చంద్రుడి మట్టిని గట్టిగా చేయడానికి, దాన్ని కరిగించి ఘన ఉపరితలంగా మార్చడానికి రెడ్‌ వైర్‌ అనే సంస్థకు నాసా బాధ్యతలు అప్పగించింది. వీటి సాయంతో ధూళికి తావులేని ప్రదేశాలను సిద్ధం చేస్తారు. అలాగే చంద్రుడిపై కట్టే ఇళ్లకు పునాదులు, రోడ్లు, ల్యాండింగ్‌ ప్యాడ్‌ లను కూడా సిద్ధం చేయవచ్చని చెబుతున్నారు.

అలాగే చంద్రుడిపై ప్లుటోనియం ఆధారిత విద్యుదుత్పత్తి వ్యవస్థ కోసం వెలుపలి ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా స్థిరంగా కొనసాగే రేడియో ఐసోటోపిక్‌ విద్యుత్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి జెనో పవర్‌ సిస్టమ్స్‌ను నాసా ఎంపిక చేసింది.