Begin typing your search above and press return to search.

రాజ్యసభ ఎంపీల్లోఅత్యధిక ధనవంతులు తెలుగువారే... లెక్కలివే!

తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆరెస్స్, వైసీపీలకు చెందిన ఎంపీలు

By:  Tupaki Desk   |   19 Aug 2023 6:54 AM GMT
రాజ్యసభ ఎంపీల్లోఅత్యధిక ధనవంతులు తెలుగువారే... లెక్కలివే!
X

ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 233 మంది సభ్యుల్లో 225 మంది అఫిడవిట్‌ లను పరిశీలించి అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ, నేషనల్ ఎలక్షన్ వాచ్ లు సంయుక్తంగా ఒక నివేధికను విడుదల చేశాయి. ఈ నివేదిక ప్రకారం... అత్యధిక ఆస్తులు ఉన్న రాజ్యసభ ఎంపీల్లో తెలుగు వారే ఉన్నారని తెలిపింది!

అవును.. తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆరెస్స్, వైసీపీలకు చెందిన ఎంపీలు... అత్యధిక ఆతులతో జాతీయపార్టీల సభ్యుల కంటే పై స్థానంలో నిలిచారు. తాజా నివేధిక ప్రకారం... వీరిలో తొలి రెండు స్థానాల్లోనూ బీఆరెస్స్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి, వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డిలు నిలిచారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న బీఆరెస్స్, వైసీపీలకు చెందిన 16 మంది రాజ్యసభ ఎంపీల ఆస్తుల మొత్తం విలువలో వీరిద్దరి వాటాయే ఏకంగా 86.02 శాతం కావడం గమనార్హం. ఇందులో పార్థసారథిరెడ్డి ఆస్తుల విలువ రూ.5300 కోట్లు కాగా, యోధ్యరామిరెడ్డి ఆస్తుల విలువ రూ.2,577 కోట్లు!

ఇదే సమయంలో మొత్తం రాజ్యసభలో ఉన్న 225 మంది సభ్యుల ఆస్తుల విలువ రూ. 18,210 కోట్లు కాగా.. అందులో వీరిద్దరి సంపదే 43.25 శాతంగా ఉండటం మరో ఆసక్తికరమైన అంశం! వీరితర్వాత.. అమితాబ్‌ బచ్చన్‌ సతీమణి, సమాజ్‌ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ రూ. 1001 కోట్లతో ఈ తెలుగు ఎంపీల తర్వాత స్థానంలో నిలిచారు.

మరింత క్లియర్ గా చెప్పాలంటే... రాజ్యసభలో అతిపెద్ద పార్టీలుగా ఉన్న బీజేపీ (85), కాంగ్రెస్‌ (30)లకు చెందిన 115 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.4,128 కోట్లుగా ఉంటే... తెలుగు రాష్ట్రాలకు చెందిన బీఆరెస్స్ (7), వైసీపీ (9)లకు చెందిన 16 మంది రాజ్యసభ సభ్యుల ఆస్తి విలువ రూ.9,157 కోట్ల మేర నమోదని ఏడీఆర్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఇక పార్టీల వారీగా వివరాలు చూస్తే ముందుగా అన్ని పార్టీలకంటే ఎక్కువగా తెలంగాణ అధికార పార్టీ బీఆరెస్స్ రాజ్యసభ ఎంపీల ఆస్తి విలువ రూ.5,596 కోట్లు కాగా.. ఏపీ అధికారపక్షం వైసీపీ రాజ్యసభ సభ్యుల ఆస్తి రూ.3,561 కోట్లు! ఇక ఆతర్వాత స్థానాల్లో కేంద్రంలోని పెద్దపార్టీలు ఉన్నాయి.

వాటిలో భారతీయ సభ్యుల ఆస్తుల విలువ రూ.2,579 కోట్లు, కాంగ్రెస్‌ సభ్యులు ఆస్తుల విలువ రూ.1,549 కోట్లు, ఇక ఆం ఆద్మీ పార్టీ సభ్యులు ఆస్తుల విలువ రూ.1,316 కోట్లు, సమాజ్‌ వాదీ పార్టీ సభ్యులు రూ.1,019 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.

ఇదే సమయంలో రాష్ట్రాలవారీగా సభ్యుల ఆస్తుల విలువ విషయానికొస్తే... తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (రూ.5,596 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (రూ.3,823 కోట్లు)లు తొలి రెండుస్థానాల్లో ఉండగా.. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ (రూ.1,941 కోట్లు), పంజాబ్‌ (రూ.1,136 కోట్లు), మహారాష్ట్ర (రూ.1,070) నిలిచాయి.

ఇక అప్పుల విషయానికొస్తే... అత్యధిక అప్పులున్న ఎంపీల్లో వైసీపీ సభ్యులు తొలి రెండుస్థానాల్లో ఉన్నారు. వీరిలో పరిమళ్‌ నత్వానీకి రూ.209 కోట్ల అప్పులుండగా.. ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి రూ.154 కోట్ల అప్పులున్నాయి.

33శాతం మందిపై క్రిమినల్ కేసులు:

పెద్దల సభ్యలోని పెద్దల్లో 33% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తాజా నివేదిక తెలిపింది. ఈ లెక్కల ప్రకారం... 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. వీరిలో 18% మంది, అంటే... 41 మందిపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి.

ఇదే సమయంలో మహిళలపై నేరాలకు పాల్పడినట్లు నలుగురు ఎంపీలు అభియోగాలు ఎదుర్కొంటుండగా... మరో నలుగురిపై ఐపీసీ 307 కింద హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వీరంతా భారతదేశ పార్లమెంటులోని పెద్దల సభగా చెప్పే రాజ్యసభలో ఎంపీలుగా ఉన్నారు!!