Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి కోసం బండ్ల ప్లాన్ గట్టిగానే ఉందా !

అందుకే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గ‌ణేష్ త‌న ఫేవ‌రెట్ రేవంత్ రెడ్డిపై అభిమానాన్ని బాహాటంగానే చాటుకున్నాడు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 4:28 AM GMT
రేవంత్ రెడ్డి కోసం బండ్ల ప్లాన్ గట్టిగానే ఉందా !
X

తెలంగాణ కాంగ్రెస్ ని విజేత‌గా నిల‌బెట్టిన‌ రేవంత్ రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో సిస‌లైన హీరో అని నిరూపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ముఖ్యమైన పాత్రను అనుసరించి ఇప్పుడు రేవంత్ రెడ్డి జీవితంపై బయోపిక్ తీసేందుకు ఒక నిర్మాత సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరిన మొన‌గాడు. టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ని జ‌గ‌జ్జేత‌గా నిల‌బెట్టి స‌వాల్ ని నిరూపించాడు.

అందుకే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గ‌ణేష్ త‌న ఫేవ‌రెట్ రేవంత్ రెడ్డిపై అభిమానాన్ని బాహాటంగానే చాటుకున్నాడు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు బండ్ల గణేష్ తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అది ముగిసే వరకు ఈవెంట్ వేదికైన ఎల్బీ స్టేడియంలో క్యాంపింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. సీఎంగా కిరీటం ధ‌రించే క్ర‌మంలో జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీల దృష్టిని అత‌డు ఆక‌ర్షించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు.

తాజాగా బండ్ల గణేష్ రేవంత్ రెడ్డి జీవితంపై బయోపిక్ నిర్మించాలనే తన ఉద్దేశ్యాన్ని వెల్లడిస్తూ ఒక మీడియా చాట్ లో బండ్ల గ‌ణేష్ ముఖ్యమైన ప్రకటన చేశాడు. నాయ‌కుడిగా రేవంత్ రెడ్డి ఎదుర్కొన్న సవాళ్లను, జైలు శిక్ష, అత‌డి వ్యతిరేకుల నుండి ప్రతికూలతలను హైలైట్ చేస్తూ సినిమా తీస్తాన‌ని అన్నారు. ఇండ‌స్ట్రీలో బ్లాక్ బ‌స్ట‌ర్ నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న బండ్ల గ‌ణేష్ చాలా కాలంగా సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించిన గ‌ణేష్ అత‌డితో మ‌రో అవ‌కాశం కోసం చాలా ఎదురు చూసినా అది సాధ్య‌ప‌డ‌లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ‌యోపిక్ అంటూ లైమ్ లైట్ లో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.