Begin typing your search above and press return to search.

క్రిష్ణా నది ప్రాజెక్టులపై రేవంత్ సర్కారు వాదన ఏంటి?

కొద్ది రోజులుగా క్రిష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులను క్రిష్ణా బోర్డుకు అప్పగించేందుకు అంశంపై హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 Feb 2024 5:10 AM GMT
క్రిష్ణా నది ప్రాజెక్టులపై రేవంత్ సర్కారు వాదన ఏంటి?
X

కొద్ది రోజులుగా క్రిష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులను క్రిష్ణా బోర్డుకు అప్పగించేందుకు అంశంపై హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి కేసీఆర్ సర్కారు గతంలోనే సంతకం చేసిందని రేవంత్ సర్కారు ఆరోపిస్తుంటే.. తమ భుజాల మీద గన్ పెట్టి రేవంత్ సర్కారు కాలుస్తుందని.. చేతకానితనంతో రేవంత్ సర్కారు తప్పులు చేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతంపై మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీ ఒకరు తాజాగా కేంద్రాన్ని అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని ఉటంకించటమే కాదు.. క్రిష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులను క్రిష్ణా బోర్డుకు అప్పగించే విషయంలో నాటి కేసీఆర్ సర్కారు దారుణమైన తప్పులకు పాల్పడిందని.. తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్లుగా తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఈ వాదన ప్రతివాదనలు సాగుతున్న వేళ.. అసలు నిజం ఏమిటన్నది ఒక ప్రశ్న అయితే.. సోమవారం ప్రభుత్వం ఈ అంశంపై ఒక రిపోర్టును విడుదల చేసింది. ‘‘క్రిష్ణా నదీ ప్రాజెక్టులపై వాస్తవాలు’’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పలు అంశాల్ని ప్రస్తావించారు. 47 పేజీలు ఉన్న ఈ రిపోర్టును సభకు ప్రభుత్వం అందజేసింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి క్రిష్ణా బేసిన్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడే విషయంలో గత ప్రభుత్వం విఫలైన విషయాన్ని ప్రస్తావించారు. ఇందులో పేర్కొన్న అంశాలు చూస్తే..

- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు ముందు అర్థరాత్రి దాటిన తర్వాత నాగార్జునసాగర్ ప్రాజెక్టుపైకి ఏపీ ప్రభుత్వం.. సాయుధ పోలీసులను పంపి అక్రమంగా నీటిని విడుదల చేసుకుంది. దీనిపై అప్పటి తెలంగాణ ప్రభుత్వం చేష్టలుడిగినట్లు వ్యవహరించింది.

- ఈ ఉదంతం తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ కేఆర్ఎంబీ ఛైర్మన్ కు లేఖ రాశారు. శ్రీశైలం.. నాగార్జునసాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణను బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు.

- 2021 జులై 15న గెజిట్ నోటిఫికేషనన్ ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించటానికి రెండు రాష్ట్రాలు అంగీకరించిన విషయం కూడా తెలిసిందే. కానీ.. రెండు డ్యాంల ఆపరేషన్ ప్రోటోకాల్ ను ఖరారు చేయనందున అప్పగింత ప్రక్రియ ఆలస్యమైందని లేఖలో పేర్కొన్నారు.

- క్రిష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులను క్రిష్ణా బోర్డుకు అప్పగించేందుకు సంబంధించిన మాన్యువల్ ముసాయిదాను 2015లోనే తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నాటి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్.. ప్రభుత్వం ఆమోదించినట్లుగా లేఖ రాశారు. 2023 డిసెంబరు 1న అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ రాసిన లేఖలో ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించటానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా పేర్కొన్నారు.

- కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలు.. లోపభూయిష్ట విధానాల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లింది.

- ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం క్రిష్ణా బేసిన్ పై ఉన్న ప్రాజెక్టుల నీటి నిర్వాహణ.. నియంత్రణ కోసం క్రిష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన ప్రాజెక్టులను అప్పజెప్పేందుకు మాన్యువల్ ముసాయిదాకు ఆమోదం తెలిపిందంటూ 2015 మే 18న అప్పటి ఇంజినీర్ ఇన్ చీఫ్ క్రిష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు.

- ఏయే ప్రాజెక్టులను బోర్డు నిర్వాహణకు అప్పగించేది కూడా తెలిపారు. అందులో శ్రీశైలం.. నాగార్జునసాగర్ కూడా ఉన్నాయి. 2020 అక్టోబరు 6న కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన రెండో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పటి తెలంగాణ సీఎం (కేసీఆర్) ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

- కేంద్ర ప్రభుత్వమే కేఆర్ఎంబీ.. జీఆర్ఎంబీ అధికార పరిధిని నోటిఫై చేయటానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో నిర్దేశించిన మేరకు కేఆర్ఎంబీ పరిధి ఉంటుందని కేంద్ర మంత్రి అప్పుడే స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా 2021 జులై 15న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

- ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుంచి 60 రోజుల్లో ఆంధ్ర.. తెలంగాణ ప్రభుత్వాలు రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీని డిపాజిట్ చేయాలి. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను.. అప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టు పనులు పూర్తి కాగానే వాటిని కేఆర్ఎంబీకి అప్పగించాలన్న నిబంధన ఉంది.

- నాడు కేంద్రప్రభుత్వం జారీ చేసిన నోటిషికేషన్ ను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సవాలు చేయలేదు. ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా క్రిష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులను అప్పగించేందుకు గత ప్రభుత్వం మొగ్గు చూపింది. 2021 అక్టోబరు 12న 15వ కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్.. ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లు పాల్గొన్నారు. ప్రాధాన్య క్రమంలో శ్రీశైలం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన 15 కాంపొనెంట్లను అప్పగించి నోటిఫికేషన్ అమలు చేసేందుకు సబ్ కమిటీ చేసిన సిఫార్సులను బోర్డు ఆమోదించింది.

- 2022 మే 6న జరిగిన సమావేశంలోనూ ఖరారు చేసిన కాంపొనెంట్లు అప్పగించేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బోర్డుకు హామీ ఇచ్చారు. గత ఏడాది అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోనూ కేఆర్ఎంబీకి సీడ్ మనీని ఇచ్చేందుకు ఆ ప్రభుత్వం (కేసీఆర్ సర్కార్) కేటాయింపులు చేసింది. క్రిష్ణా బేసిన్ లోని శ్రీశైలం.. నాగార్జునసార్.. గోదావరి బేసిన్ లోని పెద్దవాగు మధ్యతరమా ప్రాజెక్టు వంటి ఉమ్మడి ప్రాజెక్టుల కాంపొనెంట్లను అప్పగించేందుకు తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించింది.

- 2015 ఆగస్టులో శ్రీశైలం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ముసాయిదాకు ఆమోదం తెలుపుతూ కేంద్రానికి లేఖ రాసినప్పటి నుంచి కేసీఆర్ సర్కారు దిగిపోయే వరకు ప్రాజెక్టులను అప్పగించేందుకే గత ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ తప్పుడు విధానాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలుగా మారాయి.