Begin typing your search above and press return to search.

ప్ర‌మాణ స్వీకారానికి రామ్మా.. నీ ఉద్యోగ ఫైల్‌పై సంత‌కం చేస్తా: రేవంత్ ప్ర‌త్యేక ఆహ్వానం

అంతేకాదు.. ప్ర‌మాణ స్వీకార ఘ‌ట్టం ముగియ‌గానే ఆమెకు ఉద్యోగం క‌ల్పించే ఫైలుపైనా ఆయ‌న సంత‌కం చేయ‌నున్న‌ట్టు చెప్పాయి.

By:  Tupaki Desk   |   6 Dec 2023 4:50 PM GMT
ప్ర‌మాణ స్వీకారానికి రామ్మా.. నీ ఉద్యోగ ఫైల్‌పై సంత‌కం చేస్తా:  రేవంత్ ప్ర‌త్యేక ఆహ్వానం
X

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఇంకా ప్ర‌మాణ స్వీకారం చేయ‌క‌ముందే.. కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప‌ని మొద‌లు పెట్టేశారు. ఎన్నిక‌ల‌కు ముందు తాను ఇచ్చిన హామీల్లో కీల‌క‌మైన వాటినిఅమ‌లు చేసేందుకుఆయ‌న న‌డుం బిగించారు. ఈ క్ర‌మంలో ఓ దివ్యాంగురాలిని త‌న ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ర‌మ్మ‌ని ప్ర‌త్యేక ఆహ్వానం పంపించిన‌ట్టు పీసీసీ వ‌ర్గాలు తెలిపాయి. అంతేకాదు.. ప్ర‌మాణ స్వీకార ఘ‌ట్టం ముగియ‌గానే ఆమెకు ఉద్యోగం క‌ల్పించే ఫైలుపైనా ఆయ‌న సంత‌కం చేయ‌నున్న‌ట్టు చెప్పాయి.

ఎన్నిక‌ల‌కు ముందు అక్టోబర్ 17 న గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డిని వికలాంగురాలు రజినీ క‌లుసుకున్నారు. త‌న బాధ‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. ఎంఏ వరకు చదివాన‌ని, అయినా త‌న‌కు ఉద్యోగం రాలేద‌ని.. కేవ‌లం విక‌లాంగురాలిన‌నే కార‌ణంతో కాదంటున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం లేక, ఏ ప్రైవెట్ సంస్థ కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని రేవంత్ కు విన్న‌వించి.. క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యారు. ఈ నేప‌థ్యంలో స్పందించిన రేవంత్ మీడియా ముందే.. ఆమెకు బ‌ల‌మైన హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే ముందుగా ఇచ్చే ఉద్యోగం నీకేన‌ని ఆయ‌న అంద‌రి ముందే హామీ ఇచ్చారు. అయితే.. సాధార‌ణంగా ఇలాంటి హామీలు అంద‌రూ ఇస్తుంటారు. ఎన్నెన్నో వాగ్దానాలు కూడా చేస్తుంటారు. కానీ, ఎన్నిక‌లు ముగిసి అధికారంలోకి రాగానే మ‌రిచిపోతారు. కానీ, రేవంత్ అలా కాకుండా.. ఈ విష‌యాన్ని మ‌న‌సులో నాటుకున్నారు. ఎల్బీ స్టేడియం లో జరిగే ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి రజనీని రావాలని ఆహ్వానం పంపారు. ఈ క్ర‌మంలో ఎల్బి స్టేడియంలో రజనీ ఉద్యోగ నియామక ఫైల్ మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సంతకం చేయనున్నారు అని సమాచారం.