Begin typing your search above and press return to search.

ఒకే రోజు ఢిల్లీలో రేవంత్.. షర్మిల.. కానీ, కలుసుకోవడాల్లేవ్!

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశం ఏమంటే.. వైఎస్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం

By:  Tupaki Desk   |   4 Jan 2024 1:30 PM GMT
ఒకే రోజు ఢిల్లీలో రేవంత్.. షర్మిల.. కానీ, కలుసుకోవడాల్లేవ్!
X

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశం ఏమంటే.. వైఎస్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం. రెండున్నరేళ్ల కిందట తండ్రి జయంతి అయిన జూలై 7న తెలంగాణలో పార్టీని నెలకొల్పారు షర్మిల. దానికి వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (వైటీపీ) పేరు పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు రెండేళ్లు పోరాటం సాగించిన షర్మిల..మంగళవారం ఉద్యోగ దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేశారు. దీంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దిగడం ఖాయం అనుకున్నారు. స్వయంగా షర్మిలనే పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ, తీరా ఎన్నికల సమయానికి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ కు మేలు జరుగుతుందంటూ ఎన్నికల బరిలోకి కూడా దిగలేదు.

పరిస్థితులు ఎంత మారాయి?

షర్మిల పార్టీ పెట్టిన సమయానికి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాలేదు. అప్పటికి మల్కాజిరిగి నుంచి ఎంపీగా మాత్రమే ఉన్నారు. అయితే, అటు షర్మిల పార్టీ స్థాపన, రేవంత్ పీసీసీ చీఫ్ కావడం అటుఇటుగా ఒకేసారి జరిగాయి. ఇటీవలి ఎన్నికలకు వచ్చేసరికి రేవంత్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ముందంజలో ఉంటే.. షర్మిల తన పార్టీని అదే కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఢిల్లీలో ఉన్నప్పటికీ..

విచిత్రంగా గురువారం వైఎస్ షర్మిల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఢిల్లీలోనే ఉన్నారు. తన పార్టీని విలీనం చేసేందుకు ఢిల్లీ వెళ్లిన షర్మిల.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిశారు. వీరద్దరి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కాగా.. తెలంగాణ సీఎంగా గత నెల 7న బాధ్యతలు చేపట్టిన రేవంత్ నామినేటెడ్ పదవుల భర్తీ అంశమై పార్టీ అధిష్ఠానంతో మాట్లాడేందుకు గురువారం దేశ రాజధానికి వెళ్లారు.

రెండూ అధిష్ఠానంతో పనే..

అటు షర్మిల పార్టీ విలీనం అయినా ఇటు రేవంత్ నామినేటెడ్ పదవులపై చర్చించడం అయినా.. రెండూ కాంగ్రెస్ అధిష్ఠానంతో ముడిపడినవే. కానీ, ఇదే సమయంలో ఎవరి పని వారిది అన్నట్లుగా ఉంది. రేవంత్ రెడ్డి, షర్మిల పరస్పర ఎదురుపడే సందర్భం కూడా రాలేదు. అలా.. ఇద్దరూ విడివిడిగానే అధిష్ఠానం పెద్దలను కలిసినట్లయింది. ఇక షర్మిల తన పర్యటన ముగించుకుని వెంటనే హైదరాబాద్ రానున్నారు. రేవంత్ నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు సాగించనున్నారు.