Begin typing your search above and press return to search.

రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రూ.70కోట్లతో 1.60లక్షల ఎకరాలకు నీళ్లు?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నెల రోజుల వ్యవధిలోనే ఆయన తనదైన ముద్రను చూపించటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jan 2024 10:39 AM IST
రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రూ.70కోట్లతో 1.60లక్షల ఎకరాలకు నీళ్లు?
X

తన పాలనలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించాలన్నదే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నెల రోజుల వ్యవధిలోనే ఆయన తనదైన ముద్రను చూపించటం తెలిసిందే. తాజాగా అలాంటి ప్రపోజల్ తెర మీదకు తీసుకురావటం ద్వారా ఆసక్తికర చర్చకు తెర తీశారు. ఆడంబరంగా.. అర్భాటంగా వేలాది కోట్లు ఖర్చు చేయటం కన్నా.. తెలివిగా ఖర్చు చేయటం ద్వారా ప్రజలకు మేలు చేయాలన్నదే లక్ష్యమన్నట్లుగా రేవంత్ ప్రభుత్వ ఆలోచనగా ఉంది.

ఇందులో భాగంగా తాజాగా సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఇప్పటివరకు రూ.700 కోట్లు ఖర్చు చేయగా.. ఒక్క ఎకరాకు నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఇలాంటి వేళ.. కేవలం రూ.70 కోట్లు ఖర్చు చేసి లింకు కాలువ తవ్వితే ఈ ఏడాది రూ.1.60 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చనది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటగా చెప్పాలి. తాజాగా సీతారామ ఎత్తిపోతలపై పథకంపై జరిగిన రివ్యూలో భాగంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

మే నెలాఖరు నాటికి సీతారామ ఎత్తిపోతల లింకు కాలువలు పూర్తి చేయాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. దశల వారీగా ప్రాధాన్యతను బట్టి పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నిజానికి ఈ ఫ్రాజెక్టు గత ప్రభుత్వంలో సా..గుతూనే ఉంది కానీ పూర్తి కాలేదు. ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ.. చివరి దశ పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. మిగిలిన పనులన్నీ పూర్తి కావాలంటే రూ.5వేల కోట్లకు పైనే ఖర్చు అవుతుంది.

ఈ లోపు పనులు పూర్తైన చోట లింకు కాలువలు నిర్మిస్తే.. ఇప్పటికే ఉన్న నాగార్జునసాగర్ కాలువల ద్వారా ఆయుకట్టుకు సాగునీరు ఇచ్చే వీలుంది. అందుకే.. పనుల్ని వేగంగా పూర్తి చేయటం ద్వారా మే నెలాఖరు నాటికి రైతులకు నీళ్లు వచ్చే అవకాశాలపై ఫోకస్ చేయాలని ఆదేశించారు. మొత్తంగా ఖర్చుచేసే సొమ్మును జాగ్రత్తగా ఖర్చు చేయటంతో పాటు.. వాటి ఫలాలు వెంటనే అందేలా ప్లాన్ చేయాలన్నట్లుగా కొత్త సర్కారు ఆలోచనగా ఉందన్న మాట వినిపిస్తోంది.