Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తొలి జాబితాలో రేవంత్ ముద్ర.. శాపంగా మారనుందా?

గ్రేటర్ పరిధిలో కీలకమైన శేరిలింగంపల్లి.. కూకట్ పల్లి.. జూబ్లీహిల్స్.. ఖైరతాబాద్.. కంటోన్మెంట్.. ఎల్ బీ నగర్.. రాజేంద్రనగర్ లాంటి స్థానాలను వదిలేసి.. పాతబస్తీ పరిధిలోని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Oct 2023 12:04 PM IST
కాంగ్రెస్ తొలి జాబితాలో రేవంత్ ముద్ర.. శాపంగా మారనుందా?
X

తెలంగాణ ఎన్నికల గంట మోగింది. షెడ్యూల్ వచ్చేసి కూడా వారం దాటేసింది. అందరికంటే ముందే అధికార బీఆర్ఎస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే.. ఆదివారం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల మొదటి లిస్టును విడుదల చేసింది. కీలక స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించని ఆ పార్టీ.. ఇద్దరు.. ముగ్గురు పోటీ పడే స్థానాల్ని ప్రకటించకుండా ఆపేసింది. దశల వారీగా విడుదల చేసే జాబితాల్లో మిగిలిన అభ్యర్థుల పేర్లు ఉంటాయని చెబుతున్నారు.

కాంగ్రెస్ తొలి జాబితాలో ముఖ్య నేతలు మినహా.. కొన్ని కీలక స్థానాల్లో టికెట్ ఆశించిన అభ్యర్థులకు మినహా.. రేవంత్ రెడ్డికి విధేయులుగా ఉండేవారికి.. ఆయన వర్గీయులుగా ముద్ర పడిన వారికి టికెట్లు దక్కటం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 55 మంది అభ్యర్థుల్లో 13 మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి చెందిన వారే కావటం గమనార్హం. గ్రేటర్ పరిధిలో కీలకమైన శేరిలింగంపల్లి.. కూకట్ పల్లి.. జూబ్లీహిల్స్.. ఖైరతాబాద్.. కంటోన్మెంట్.. ఎల్ బీ నగర్.. రాజేంద్రనగర్ లాంటి స్థానాలను వదిలేసి.. పాతబస్తీ పరిధిలోని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించటం తెలిసిందే.

బీసీ ముద్ర కనిపించేలా ఉన్నప్పటికీ.. ఉప్పల్.. సికింద్రాబాద్.. సనత్ నగర్.. కుత్భుల్లాపూర్ లాంటి కీలక నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థులపై పెదవి విరుపు కనిపిస్తోంది. సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన కోట నీలిమ నియోజకవర్గంలో అత్యధికులకు అసలు పరిచయమే లేదంటున్నారు. ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. స్థానిక నేతలు సైతం విస్మయానికి గురయ్యే పరిస్థితి. అధిష్ఠానంతో ఎంత సత్ సంబంధాలు ఉంటే మాత్రం.. స్థానికంగా తెలియని వారికి టికెట్ ఇవ్వటం ఏమిటి? అన్న మాట వినిపిస్తోంది.

ఉప్పల్ నియోజకవర్గం అభ్యర్థి విషయంలోనూ తప్పు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి సుదీర్ఘకాలంగా ఉంటున్న రాగిడి లక్ష్మారెడ్డిని వదిలేసి.. ఒక డివిజన్ స్థాయి నాయకుడికి టికెట్ ఎలా ఇస్తారన్న ప్రశ్న పెద్ద ఎత్తున వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసిన వేళ.. అండగా ఉన్నంతనే టికెట్ ఇచ్చేయటమేనా? గెలుపు ఓటముల గురించి పట్టదా? అని ప్రశ్నిస్తున్నారు. కుత్భుల్లాపూర్ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇప్పటికే పలుమార్లు పార్టీలు మారిన ఆయనకు ఎలా ఇస్తారన్నది ప్రశ్న.

నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్ గా తన భార్యను గెలిపించుకోలేని కొలను హన్మంతరెడ్డికి.. ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటంలో అర్థం లేదన్న విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా పార్టీకి అండగా నిలిచిన వారిని వదిలేసి.. సీనియర్ అన్న పేరుతో టికెట్ ఇచ్చేస్తే.. పార్టీకే నష్టమంటున్నారు. తొలిజాబితాలో హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఉన్న 13 స్థానాల్లో పక్కాగా గెలిచే అవకాశాలున్న రెండు.. మూడు స్థానాల అభ్యర్థుల ఎంపికలో చోటు చేసుకున్న పొరపాట్లకు రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.