Begin typing your search above and press return to search.

బిహార్ ‘కుమార్’ బాబులకు గడ్డు కాలం షురూ!

విపక్షంలో ఉన్నప్పుడు తనను అవమానించారన్న ఆగ్రహం ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవటం షురూ చేశారా?

By:  Tupaki Desk   |   18 Dec 2023 4:40 AM GMT
బిహార్ ‘కుమార్’ బాబులకు గడ్డు కాలం షురూ!
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివేంజ్ తీర్చుకోవటం మొదలు పెట్టారా? విపక్షంలో ఉన్నప్పుడు తనను అవమానించారన్న ఆగ్రహం ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవటం షురూ చేశారా? కేసీఆర్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన బిహార్ బాబుల (బిహార్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్.. ఐపీఎస్)కు గడ్డు కాలం మొదలైందా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు తగ్గట్లుగా ఉండటం కూడా ఒక కారణంగా చెప్పాలి.

తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి కం ఎంఐయూడీ ప్రిన్సిపుల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అర్విందకుమార్ ను తప్పించి.. ఆయన స్థానంలో జలమండలి ఎండీ దానకిశోర్ ను ఎంపిక చేయటం చూస్తే.. రేవంత్ తాను చేయాలనుకున్న పనిని సెటిల్డ్ గా చేస్తున్నట్లుగా చెప్పాలి. విపక్ష నేతగా.. కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బిహార్ బ్యాచ్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

కేసీఆర్ కు కొందరు ఐఏఎస్ అధికారులు అనుకూలంగా ఉన్నారని.. వారు అధికారుల మాదిరి కాకుండా పార్టీ కార్యకర్తలుగా పని చేస్తున్నట్లుగా మండిపడ్డారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్.. ఐఏఎస్ లకు రాష్ట్రాన్ని అప్పగించినట్లుగా ఆరోపించారు. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సోమేష్ కుమార్.. అర్వింద కుమార్.. అంజనీ కుమార్.. సందీప్ సుల్తానియా.. జయేశ్ రంజ్ లాంటి బిహార్ బాబుల చేతిలో రాష్ట్రాన్ని ఉంచినట్లుగా వ్యాఖ్యానించారు.

తాజాగా అర్విందకుమార్ పై బదిలీ వేటు వేయటం... విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేయటంతో ఆయన్ను పక్కన పెట్టినట్లైందని చెప్పాలి. ఔటర్ రింగ్ రోడ్ ను మూడు దశాబ్దాల పాటు ఒక సంస్థకు లీజ్ కు ఇవ్వటంపై రేవంత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. అదో పెద్ద స్కాంగా అభివర్ణించారు. దీనిపై నాడు హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్న అర్వింద్ కుమార్ స్పందించి.. రేవంత్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు.. ప్రతివిమర్శలు వెల్లువెత్తాయి. అర్వింద్ కుమార్ పై రేవంత్ ఆరోపణలు చేశారు.

ఔటర్ లీజుపై రేవంత్ తో పాటు బీజేపీనేత రఘునందన్ రావు కూడా తప్పు పట్టారు. మంత్రి కేటీఆర్ కన్నుసన్నల్లో లీజు వ్యవహారం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ తో పాటు రఘనందన్ కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా ఔటర్ లీజుపై మున్సిపల్ శాఖ అధికారుల్ని సమాచారం కోసం రేవంత్ సచివాలయానికి వెళ్లగా.. ఆయన్ను పోలీసులు అడ్డుకోవటంఅప్పట్లో విమర్శలకు తావిచ్చింది. ఆ సందర్భంగా అర్వింద్ కుమార్ వ్యవహరించిన తీరును రేవంత్ తప్పుపట్టారు.

తాజాగా అర్వింద్ కుమార్ ను బదిలీ చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా విపక్షంలో ఉన్నప్పుడు ఆయన విమర్శలు చేసిన అధికారుల తాజా పరిస్థితి ఏమిటన్నది చర్చగా మారింది. అర్వింద్ కుమార్ పై బదిలీ వేటు పడిన నేపథ్యంలో.. రివెంజ్ షురూ అయ్యిందని.. రానున్న రోజుల్లో బిహార్ బాబులకు తన ప్రభుత్వంలో అప్రాధాన్యతను రేవంత్ ఇవ్వటం ఖాయమంటున్నారు. అయితే.. రివెంజ్ అనే కన్నా.. తనకు తగ్గట్లు అధికారుల్ని మార్చుకోవటం ముఖ్యమంత్రులకు మామూలే కదా? అన్న వాదన వినిపిస్తోంది. భవిష్యత్తులో చోటు చేసుకునే పరిణామాలు ఆయన రివెంజ్ తీర్చుకుంటున్నారా? లేదంటే.. తనకు తగ్గట్లు మార్పులు చేసుకుంటున్నారా? అన్నది తేలుతుందంటున్నారు.