Begin typing your search above and press return to search.

ఎంపీ ప‌ద‌వికి రేవంత్‌రెడ్డి రాజీనామా!

2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఆయ‌న మ‌ల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:36 PM
ఎంపీ ప‌ద‌వికి రేవంత్‌రెడ్డి రాజీనామా!
X

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనుముల రేవంత్‌రెడ్డి.. త‌న పార్ల‌మెంటు స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఆయ‌న మ‌ల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న కొడంగ‌ల్ నుంచి అసెంబ్లీకి ఎన్నిక కావ‌డం.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన నేప‌థ్యంలో ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌.. ఇటు త‌న మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల్సిన వారి(మిగిలిన శాఖ‌లు) వివ‌రాల‌తోపాటు.. శాఖ‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను తీసుకువెళ్లారు.

అదేస‌మ‌యంలో త‌న రాజీనామా ప‌త్రాన్ని కూడా ఆయ‌న వెంట తీసుకువెళ్లారు. దీనిని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వ్యక్తిగతంగా కలిసి రేవంత్ రెడ్డి సమర్పించునున్నారు. స్పీకర్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ అధిష్టానంతో చ‌ర్చించి తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.

ఇంత‌క‌న్నా తృప్తి ఏముంటుంది?

శుక్ర‌వారం ఉద‌యం ప్ర‌జాభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన‌.. ప్ర‌జాద‌ర్బార్‌పై సీఎం రేవంత్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు ప్రజాభవన్‌కు వచ్చి తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రజల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా అర్జీలు తీసుకున్నారు. విజయవంతంగా మొదటి రోజు ప్రజాదర్బార్‌ను ముగించారు.

తొలిరోజు ప్రజాదర్బార్‌ విశేషాలను సీఎం రేవంత్ ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు. ‘‘జనం కష్టాలు వింటూ… కన్నీళ్లు తుడుస్తూ.. తొలి ప్రజా దర్బార్ సాగింది. జనం నుండి ఎదిగి… ఆ జనం గుండె చప్పుడు విని… వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!’’ అంటూ సీఎం రేవంత్ ఎక్స్‌లో పోస్టు చేశారు.