Begin typing your search above and press return to search.

ఏబీవీపీ టు కాంగ్రెస్ సీఎం... హాట్ టాపిక్ గా రేవంత్ ప్రయాణం!

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు

By:  Tupaki Desk   |   7 Dec 2023 1:30 PM GMT
ఏబీవీపీ టు కాంగ్రెస్ సీఎం... హాట్ టాపిక్ గా రేవంత్ ప్రయాణం!
X

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో ఏబీవీపీతో విద్యార్థి నాయకుడిగా మొదలైన రేవంత్ ప్రయాణం నేడు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంపిక అవ్వడం వరకూ హాట్ టాపిక్ గా మారింది. ఆశ్చర్యకరంగా రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి రాజకీయం టీఆరెస్స్ (బీఆరెస్స్) నుంచే మొదలవ్వడం గమనార్హం.

అవును... 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి... 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. ఫలితంగా తొలిసారి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జేడ్.పీ.టీ.సీ.) సభ్యునిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో 2008లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో శాసనమండలికి ఎన్నికయ్యారు.

ఈ క్రమంలో అదే ఏడాది టీడీపీలో చేరిన రేవంత్ రెడ్డి... టీడీపీలో చేరి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం నాయుడుకు నమ్మకస్తుడిగా మారారు. ఈ క్రమంలోనే 2009, 2014లో టీడీపీ టిక్కెట్‌ పై శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో 2015లో శాసన మండలి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి కెమెరాకు చిక్కారానే ఆరోపణలు అతను తన రాజకీయ జీవితంలో అతిపెద్ద సవాలుగా మారాయి!

ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ అభ్యర్థి చేతిలో ఓడిపోయి కొంతకాలం రాజకీయ అరణ్యవాసం చేసిన రేవంత్ రెడ్డి... ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. ఈ సమయంలో 2019 ఎన్నికలలో మల్కాజిగిరి నుండి రెడ్డి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. ఈ సమయంలో 2021 రేవంత్ పొలిటికల్ కెరీర్ లో కీలమైన ఏడాదిగా మారింది.

కాంగ్రెస్‌ లో మహామహులమని చెప్పుకునే చాలామంది సీనియర్లను కాదని.. జూనియర్‌ అయినప్పటికీ 2021లో పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్ర కాంగ్రెస్ లోని పలువురు సీనియర్లలో గుండెల్లో మంటకు దారితీసింది. ఈ సమయంలో సవాలక్ష పరిస్థితుల మధ్య పాత పార్టీని పునరుజ్జీవింపజేసే అనూహ్యమైన పనికి బలంగా పూనుకున్నారు రేవంత్.

అంతకంటే ముందు... 2018 అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత తెలంగాణలో అధికార బీఆరెస్స్ బలం పరాకాష్టకు చేరిందనే కామెంట్లు వినిపించాయి. ఆ సమయంలో సుమారు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆరెస్స్ లో చేరిపోయారు. మరోపక్క జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల్లో మరో ప్రత్యర్థి బీజేపీ బలం చూపించింది.. సత్తా చాటింది.

ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎదురుదెబ్బలను ఎదుర్కొంటూనే ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ముందుకు కదిలింది. ఇక ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో గెలుపొందడంతో.. ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నాటినుంచి దినదినాభివృద్ధి అన్న తరహాలో పార్టీలో కీలక చేరికలు మొదలయ్యాయి. దీంతో అన్ని జిల్లాల్లోనూ పార్టీ బలపడటం మొదలుపెట్టింది.

ఇక తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధికార బీఆరెస్స్ పై నిప్పులు చెరిగారు. బీఆరెస్స్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తుందంటూ ఫైరయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ అంశాన్ని బలంగా విద్యార్థులు, నిరుద్యోగుల లోకానికి తీసుకెళ్లారు. అన్నీ అనుకూలంగా జరగడంతో తెలంగాణలో కాంగ్రెస్ కు మెజారిటీ రావడంలో కీలక భూమికపోషించారు. తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.