Begin typing your search above and press return to search.

తెలంగాణా పీఠం పైన రేవంత్ రెడ్డి!

ఈ విషయాన్ని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 3:56 PM
తెలంగాణా పీఠం పైన రేవంత్ రెడ్డి!
X

అంతా అనుకున్నట్లే జరిగింది. ఫైటర్ గా ఫైర్ బ్రాండ్ గా కాంగ్రెస్ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి సీఎం కిరీటం తొడిగింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు.

రేవంత్ రెడ్డిని తెలంగాణా ముఖ్యమంత్రిని చేయడం ద్వారా కాంగ్రెస్ కొత్త పంధాను అనుసరించింది. యువతరం ప్రతినిధిని అవకాశం ఇచ్చింది. అంతే కాదు సీనియర్లు అని సమీకరణలు ఇతర కారణాలు అని చూడకుండా ఫైట్ చేసిన వారికే పదవి అన్నట్లుగా వ్యవహరించింది. పార్టీని గత కొన్నేళ్ళుగా దూకుడుగా ముందుకు పోనిచ్చి రాదనుకున్న చోట అధికారాన్ని తెచ్చిన యోధుడిగా రేవంత్ రెడ్డిని గుర్తించింది.

ఇక కాంగ్రెస్ నిర్ణయం కరెక్ట్ అన్నది అందరి మాట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారిలో అత్యధికులు రేవంత్ రెడ్డిని సీఎం గానే అనుకును ఓటేసిన వారే. కేసీఆర్ కి సమ ఉజ్జీగా రేవంత్ రెడ్డిని అంతా చూసారు. ఇక కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి మధ్య సీఎం పదవికి పోటీ పెడితే ఆయనతో సరిసమానంగా నిలిచి జనం మెప్పు పొందారు. అంటే తెలంగాణా సమాజం, కేసీఆర్ తరువాత సీఎం పీఠం ఎక్కాల్సింది రేవంత్ రెడ్డి అని తేల్చింది. దాంతో కాంగ్రెస్ హై కమాండ్ కూడా అసలైన ప్రజాభిప్రాయనికి ఓటేసినట్లు అయింది.

మరో వైపు చూస్తే సీనియర్లు చాలా మంది ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అంటే అనేక సమీకరణలు కూడా కనిపిస్తాయి. కానీ ఈసారి చాలా స్మార్ట్ గా కాంగ్రెస్ ఆలోచించింది. కర్నాటక ఫార్ములాను తెలంగాణాకు అప్లై చేయకపోవడంలోనే కాంగ్రెస్ తెలివి కనిపిస్తోంది

ఇవన్నీ ఇలా ఉంటే కాంగ్రెస్ హై కమాండ్ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి అర్జంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. ఆయన అక్కడ అధినాయకత్వంతో అన్నీ మాట్లాడుకుని ఈ నెల 6న తిరిగి వస్తారని అంటున్నారు. 7వ తేదీన రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణం చేయనున్నారు. మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణా రాజకీయాల్లో రేవంత్ రెడ్డి శకం స్టార్ట్ అయింది. ఆయన ఇంతింతై వటుడింతే అన్నట్లుగా ఎదిగి ఈ రోజు అసలైన లక్ష్యాన్ని సాధించారు. కాంగ్రెస్ కి కూడా కొత్త రూట్ ని చూపించారు.