Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇంటి మనిషి గుట్టు రేవంత్‌కు దొరికిపోయిందా?

బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్‌కు న‌మ్మిన‌బంటు అనే పేరున్న ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి టార్గెట్ గా రేవంత్ నిప్పులు చెరిగారు.

By:  Tupaki Desk   |   14 Sep 2023 1:30 AM GMT
కేసీఆర్ ఇంటి మనిషి గుట్టు రేవంత్‌కు దొరికిపోయిందా?
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏ మాత్రం అవకాశం దొరికినా విరుచుకుపడే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా ఇలాంటి ఓ అవకాశంతో గులాబీ పార్టీ ర‌థ‌సార‌థి న‌మ్మిన‌బంటును టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్‌కు న‌మ్మిన‌బంటు అనే పేరున్న ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి టార్గెట్ గా రేవంత్ నిప్పులు చెరిగారు. యువ‌త మ‌దిని చూర‌గొనేలా రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు కేవ‌లం ఎమ్మెల్సీని మాత్ర‌మే కాకుండా కేసీఆర్‌ను సైతం ఇర‌కాటంలో ప‌డేసేలా ఉన్నాయ‌ని అంటున్నారు.

పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జ‌రిగాయంటూ వ‌రంగ‌ల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ప‌లు విద్యార్థి సంఘాలు ఆందోళ‌న చేస్తున్నాయి. పోలీసుల దాడుల్లో గాయపడిన ప‌లువురు విద్యార్థులు యూనివ‌ర్సిటీ ప‌రిధిలోనే నిర‌స‌న తెలుపుతున్నారు. వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టిస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేడు కాక‌తీయ యూనివ‌ర్సిటీకి వెళ్లి నిర‌స‌న‌లో ఉన్న విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పీహెచ్డీ అడ్మిషన్లలో అర్హత లేని వారికి, టీఆరెస్ జెండా మోసిన వారికి అడ్మిషన్లు ఇచ్చారని మండిప‌డ్డారు. మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని విద్యార్థులు వీసీ దృష్టికి తీసుకెళ్ల‌గా వారిపై పోలీసులు దాడులకు పాల్ప‌డ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఓయూ తో పాటు కేయూ కూడా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి విద్యార్థుల పోరాటాల ఫలితంగానే.. కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు పదవులు వచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ యూనివర్సిటీలను లేకుండా చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారా? అని రేవంత్ ప్ర‌శ్నించారు. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డే కారణమ‌ని రేవంత్ ఆరోపించారు.

సొంత యూనివర్సిటీ కోసం కేయూ ను మూసేయించాలని కుట్ర చేస్తున్నారని విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి బంట్రోతుగా మారిన వ్యక్తిని కేయూ వీసీగా నియమించారని ఆరోపించారు. స్వయంగా వీసీ విద్యార్థులను పోలీసులతో కొట్టించారంటే...అలాంటి వీసీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కేయూ వీసీ స్పందించి ఉంటే... ఇవాళ విద్యార్థులు నిరసన తెలిపే పరిస్థితి వచ్చేది కాదని రేవంత్ అన్నారు.

కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కేయూ రిజిస్ట్రార్ ఏ ప్రాంతం వారిని నియమించారో విద్యార్థులు గ‌మ‌నిస్తున్నార‌ని రేవంత్ తెలిపారు. విద్యార్థులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల‌ని, వీసీపై విచారణకు ఆదేశించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సెలవులు పొడగించడం.. మెస్ లు మూసేయడం సమస్యకు పరిష్కారం కాదని తెలిపిన రేవంత్ విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుంద‌న్నారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంద‌ని తెలిపిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమాలపై విచారణకు ఆదేశిస్తామ‌ని అన్నారు. విద్యార్థులను కొట్టిన పోలీసు అధికారులపై అవసరమైన చర్యలు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.