Begin typing your search above and press return to search.

రేవంత్‌ చెంతకు.. కేసీఆర్‌ సన్నిహిత స్వామీజీ!

కేసీఆర్‌ ఆగ్రహంతో నాటి అధికార బీఆర్‌ఎస్‌ నేతలెవరూ చినజీయర్‌ స్వామి వైపు కానీ, ముచ్చింతల్‌ వైపు కానీ తొంగి చూసిన పాపాన పోలేదు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 7:14 AM GMT
రేవంత్‌ చెంతకు.. కేసీఆర్‌ సన్నిహిత స్వామీజీ!
X

త్రిదండి శ్రీ రామానుజ చినజీయర్‌ స్వామి... పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఆయనకు విశేష గౌరవ, ఆతిథ్యాలు దక్కేవి. కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న దాదాపు పదేళ్ల కాలంలో అత్యధిక కాలం చినజీయర్‌ స్వామి కేసీఆర్‌ కు రాజ గురువులాగా చలామణి అయ్యారని అంటారు.

అయితే ఎప్పుడయితే చినజీయర్‌ స్వామి శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌ లో రామానుజ విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారో అప్పటి నుంచి చినజీయర్‌ స్వామిని కేసీఆర్‌ పక్కనపెట్టారని టాక్‌. అంతేకాకుండా విగ్రహావిష్కరణ సందర్భంగా విడుదల చేసిన కరపత్రంలోనూ కేసీఆర్‌ పేరు లేకపోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించిందని అప్పట్లో టాక్‌ నడిచింది.

కేసీఆర్‌ ఆగ్రహంతో నాటి అధికార బీఆర్‌ఎస్‌ నేతలెవరూ చినజీయర్‌ స్వామి వైపు కానీ, ముచ్చింతల్‌ వైపు కానీ తొంగి చూసిన పాపాన పోలేదు. ఒకప్పుడు చినజీయర్‌ స్వామికి కేసీఆర్‌ సాష్టాంగ ప్రమాణం చేశారు. అలాంటి కేసీఆర్‌ ఆగ్రహానికి గురికావడంతో స్వామీజీ కూడా ఇన్నాళ్లు మిన్నకుండిపోయారని అంటారు.

ఇదేకాకుండా గతంలో చినజీయర్‌ స్వామి సమ్మక్క సారలమ్మ దేవతల గురించి మాట్లాడిన వీడియో కూడా వివాదాస్పదమైంది. దీంతో చిన్నజీయర్‌ స్వామిని పట్టించుకునేవారు కరువయ్యారు.

ఇన్నాళ్లకు మళ్లీ చినజీయర్‌ స్వామి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో చినజీయర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది. ఇప్పుడు చినజీయర్‌ స్వామి ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ పరమార్థం ఏమిటనేదానిపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

కాగా, ముచ్చింతల్‌ నిర్వహించనున్న బ్రహోత్సవ వేడుకలకు ఆహ్వానించడానికే రేవంత్‌ రెడ్డిని చినజీయర్‌ స్వామి కలిశారని టాక్‌ నడుస్తోంది. గతంలో కేసీఆర్‌ తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు ఆయనను కూడా చినజీయర్‌ స్వామి ఇలాగే ఆహ్వానించేవారు. మరోవైపు అత్యంత విలువైన భూములను చినజీయర్‌ కు కట్టబెట్టారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చినజీయర్‌ స్వామి ఆయనను కలవడం హాట్‌ టాపిక్‌ గా మారింది.