Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్.. ఆ మీడియా మొఘల్ ను కలిశారా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొని.. ఆ వెంటనే మీడియా మొఘల్ ను కలిశారా? ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారా?

By:  Tupaki Desk   |   4 March 2024 5:46 PM GMT
సీఎం రేవంత్.. ఆ మీడియా మొఘల్ ను కలిశారా?
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొని.. ఆ వెంటనే మీడియా మొఘల్ ను కలిశారా? ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారా? రెండున్నరేళ్ల కిందట తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన పనినే ఇప్పుడూ చేశారా? మీడియా వర్గాల్లో అత్యంత చర్చనీయాంశమైన ఈ భేటీ వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం..

సీఎం రేవంత్ సోమవారం మధ్యాహ్నం ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వాస్తవానికి ఆయన సోమవారం ప్రధాని మోదీ పర్యటనకు హాజరయ్యేందుకు ఆదిలాబాద్ వెళ్లారు. అది ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వతా సీఎం నేరుగా ఫిలిం సిటీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

గంటకు పైగా భేటీ..

రామోజీరావుతో సీఎం రేవంత్ గంటకుపైగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా వివిధ అంశాలను చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలవుతోంది. ఈ క్రమంలో అభివృద్ధి పనుల తీరు, మారిన ప్రజాపాలన విధానాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులూ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సీఎం వెంట ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఉండగా..,ఈ సమావేశంలో రామోజీ పెద్ద కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. 88 ఏళ్ల రామోజీరావు కొంతకాలంగా పూర్తిగా బయటకు రావడం లేదు. అటు మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వ దూకుడుతో ఆయన కొంత కాలం కిందట ఇబ్బంది ఎదుర్కొన్నారు. వ్యక్తిగతంగానూ ఆయనతో చిన్నప్పటి నుంచి ప్రయాణం చేసిన అట్లూరి రామ్మోహనరావు గత ఏడాది మరణించారు. గతంలో హైదరాబాద్ లో ప్రైవేటు కార్యక్రమాలకు రామోజీ హాజరయ్యేవారు. వయోభారం రీత్యా ఇప్పుడు వాటికీ దూరంగా ఉంటున్నారు. అయితే, ప్రముఖులు చాలామంది ఆయన నివాసం ఉండే ఫిలిం సిటీకే వెళ్లి కలుస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గతంలో ఫిలిం సిటీలోనే రామోజీతో భేటీ అయ్యారు.

ఏపీ ఎన్నికల ముంగిట..

ఏపీలో మరొక్క నెల రోజుల్లొ అత్యంత కీలకమైన ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ, జనసేన అధికార వైసీపీని గట్టిగా ఢీ కొంటున్నాయి. ఏపీ సీఎం జగన్ నేరుగా రామోజీ పత్రిక ఈనాడును విమర్శిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రామోజీ సమావేశం ప్రాధాన్యం ఉన్న అంశమే.