Begin typing your search above and press return to search.

ఈసారి బీఆర్‌ఎస్‌ కుంభస్థలంపై కొడుతున్న రేవంత్‌!

ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. తెలంగాణ పేరును టీఎస్‌ అని కాకుండా టీజీగా మార్చనుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   4 Feb 2024 6:08 AM GMT
ఈసారి బీఆర్‌ఎస్‌ కుంభస్థలంపై కొడుతున్న రేవంత్‌!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ ను చిత్తు చేసిన రేవంత్‌ రెడ్డి ఈసారి బీఆర్‌ఎస్‌ కుంభస్థలంపై కొట్టడానికి సిద్ధమవుతున్నారని టాక్‌ నడుస్తోంది. ఈ మేరకు తాజా కేబినెట్‌ లో ఈ ప్రతిపాదన పెడతారని తెలుస్తోంది. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణ పేరును టీజీగా కాకుండా టీఎస్‌ గా మార్చారు. తెలంగాణ రిజిస్ట్రేషన్‌ తో ఉండే అన్ని వాహనాలపైనా టీఎస్‌ అనే ఉంటుంది. తన పార్టీ టీఆర్‌ఎస్‌ (ఇప్పుడు బీఆర్‌ఎస్‌) గుర్తుకు వచ్చేలా టీఎస్‌ అని కేసీఆర్‌ పేరును నిర్ణయించారని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి తాము అధికారంలోకి వచ్చాక టీఎస్‌ పేరును టీజీగా మారుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. తెలంగాణ పేరులోని అస్తిత్వాన్ని దెబ్బతీసేలా టీజీ అని కాకుండా టీఎస్‌ అని కేసీఆర్‌ పేరు పెట్టారని ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. తెలంగాణ పేరును టీఎస్‌ అని కాకుండా టీజీగా మార్చనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 5న జరగబోయే కేబినెట్‌ భేటీలో ఈ అంశాన్ని చేర్చి చర్చిస్తారని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ను ఏపీ అని, తమిళనాడును టీఎన్‌ అని.. ఇలా వివిధ రాష్ట్రాలను షార్ట్‌ కట్స్‌ పేరుతో పిలుస్తారనే సంగతి తెలిసిందే. వాహనాలపైన ఇలా ఇంగ్లిష్‌ లో షార్ట్‌ కట్‌ లో ఆ రాష్ట్రం పేరు ఉంటుంది. వాహనాల రిజిస్ట్రేషన్లలోనూ ఆ రాష్ట్రం పేరు.. పొడి అక్షరాల్లో ఉంటుంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ తమ వాహనాలపైన ఏపీని తీసేసి టీజీ అని పెట్టుకోవాలని సూచించారు. దీంతో చాలామంది ఏపీ అని తీసేసి టీజీ అని పెట్టుకున్నారు. అయితే కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక టీజీ బదులుగా టీఎస్‌ (తెలంగాణ స్టేట్‌) అని పెట్టారు.

ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ను కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ గా మార్చారు. తెలంగాణ అస్తిత్వంపైన ఏర్పడిన పార్టీ తెలంగాణను వదిలేసి 'భారత్‌' అని తగిలించుకోవడం ఏమిటని విమర్శలు వ్యక్తమయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్‌ పరాజయానికి ఇది కూడా కారణమనే వారు ఉన్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ దేన్నయితే పక్కన పెట్టారో దాన్ని తలకెత్తుకోవడం ద్వారా రేవంత్‌ రెడ్డి ముందుకు వెళ్లాలని వ్యూహం రచించారని అంటున్నారు. తెలంగాణ భావోద్వేగం రగిలేలా.. అది కాంగ్రెస్‌ కు లాభించేలా టీఎస్‌ పేరును టీజీగా మార్చాలని రేవంత్‌ నిర్ణయించుకున్నారు. తద్వారా కేసీఆర్‌ కుంభస్థలంపైనే కొట్టాలని ఆయన ఫిక్స్‌ అయ్యారని అంటున్నారు.

ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే టీఎస్‌ ను సవరించి టీజీ చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.