Begin typing your search above and press return to search.

జగన్ బాటలో రేవంత్ ?

ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు పలు విషయాల్లో ఆదర్శంగా నిలుస్తున్నట్లు అనిపిస్తున్నది.

By:  Tupaki Desk   |   13 April 2024 7:30 AM GMT
జగన్ బాటలో రేవంత్ ?
X

ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు పలు విషయాల్లో ఆదర్శంగా నిలుస్తున్నట్లు అనిపిస్తున్నది. అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. అనుకోని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, రాజకీయంగా బలపడే ప్రయత్నంలో రేవంత్ ఉన్నట్లు అతను వేస్తున్న అడుగులను చూస్తే అర్ధమవుతున్నది. కాంగ్రెస్ అంటే మితిమీరిన స్వేచ్చ. అందులోనూ రేవంత్ కాంగ్రెస్ లో ఉన్న నేతలందరికన్న పార్టీలో జూనియర్. అందుకే కోమటిరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్, జానారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా ఎవరూ తనను ముఖ్యమంత్రిగా ట్రీట్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీలో తన గ్రాఫ్ పెంచుకోవడంతో పాటు, ఆర్థికంగా తనూ బలపడేందుకు రేవంత్ స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఆంధ్రాలో జగన్ ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించి ప్రత్యేక వ్యవస్థను నియమించాడు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునే అవకాశంతో పాటు, ప్రభుత్వ నిధులతో తన కోసం, పార్టీ కోసం పనిచేసే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నట్లు అయింది. మొదట్లో ఈ వ్యవస్థను చంద్రబాబు నాయుడు వ్యతిరేకించినా తాజాగా తాను అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేలు వేతనం ఇస్తానని ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే రేవంత్ తెలంగాణలో రూ.6 వేల వేతనంతో వాలంటీర్లను నియమించుకుంటామని ప్రకటించడం గమనార్హం. ఈ వ్యవప్థను ఏర్పాటు చేయడం మూలంగా వీరంతా కాంగ్రెస్ పార్టీతో పాటు, రేవంత్ కు వీర విధేయులుగా మారతారు అన్నది రేవంత్ ఆలోచన కావచ్చు. దీనిమూలంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ను సమర్ధించే ఒక బలమైన వ్యవస్థ తయారవుతుంది.

ఇక దీంతో పాటు ఆంధ్రాలో జగన్ మాదిరిగా మద్యం పాలసీని తీసుకురావాలనే మరో ప్రయత్నంలో రేవంత్ ఉన్నట్లు అర్ధమవుతున్నది. ఆంధ్రాలో జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ప్రీమియం బ్రాండ్లను పక్కకుపెట్టి స్థానిక బ్రాండ్లను జగన్ ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీంతో గత నాలుగేళ్లుగా ఆంధ్రాలో మందుబాబులు ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ సమీపంలో ఉన్న ఆంధ్రా గ్రామాల ప్రజలు మద్యం కొనుగోళ్లకు తెలంగాణ వైపు వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల మద్యం దుకాణాల టెండర్లకు తీవ్ర పోటీ నెలకొన్నది.

ప్రీమియం బ్రాండ్లను పక్కనపెట్టి స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించడం ద్వారా ధరలు యధావిధిగా ఉంటాయి. తక్కువ ధరకు తయారయ్యే స్థానిక మద్యం బ్రాండ్లకు ఎక్కువ ధర పలకడం మూలంగా వారి నుండి డబ్బులు దండుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. అందుకే రేవంత్ ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో ? కాబట్టి ఆ లోపే తాను బలపడేందుకు అవసరమైన ప్రయత్నాలలో భాగంగా రేవంత్ జగన్ బాటలో నడుస్తున్నట్లు అనిపిస్తున్నది.