Begin typing your search above and press return to search.

రేవంత్.. అతడే ఒక సైన్యం.. అతడి సైన్యం సోదరులు

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డి రాజకీయాల్లో సొంతంగా ఎదిగారు

By:  Tupaki Desk   |   6 Dec 2023 8:53 AM GMT
రేవంత్.. అతడే ఒక సైన్యం.. అతడి సైన్యం సోదరులు
X

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డి రాజకీయాల్లో సొంతంగా ఎదిగారు. సరిగ్గా 30 ఏళ్ల కిందట ప్రింట్రింగ్ ప్రెస్ ను జీవనోపాధిగా ఎంచుకున్న ఆయన.. ఎంత ఆలోచన లేకుంటే ముఖ్యమంత్రి స్థాయికి వస్తారో ఆలోచించాలి. వాస్తవానికి అందరి జీవితం సాధారణంగానే మొదలవుతుంది. ‘‘ఆలోచించే’’ విధానంతోనే మార్పు వస్తుంది. ఎంత ఉన్నతంగా ఆలోచిస్తామో.. అంతగా ఎదుగుతాం. లేదు.. సాధారణంగా సరిపెట్టుకుంటామంటే, జీవితమూ అదే స్థాయిలో ఉంటుంది. అయితే, ఉన్నత ఆలోచనలతో ముందుకుసాగే క్రమంలో అనేక అవరోధాలు, అవమానాలు ఎదురవుతాయి. ఓ దశలో అలసిపోయాం.. అంతా అయిపోంది.. ఇక చాలు కూడా అనిపిస్తుంది. ఇలాంటి దశనూ దాటుకుని వస్తేనే విజయాలు వరిస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇలానే ఎదిగారు.

ఆరుగురు సోదరుల మధ్యన

మన సమాజంలో సహజంగా ఉండే పేద –ధనిక తారతమ్యాలను రేవంత్ చిన్నతనంలోనే చూశారు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన జీవితంపై అవగానతో ముందుకెళ్లారు. కాగా, రేవంత్ వాళ్లది చాలా పెద్ద కుటుంబం. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి స్వగ్రామం. ఆయన తల్లిదండ్రులు ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. ఈ దంపతులకు ఏడుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వీరంతా జీవితాల్లో స్థిరపడ్డారు. తమతమ పరిధిలో జీవిస్తున్నారు. క్రిష్ణారెడ్డి (అన్న) కొండారెడ్డిపల్లి సర్పంచ్ గా పనిచేశారు. తిరుపతి రెడ్డి అనే సోదరుడు కాంగ్రెస్ పార్టీ కొడంగల్ ఇంచార్జిగా రేవంత్ తరఫున పనిచేస్తున్నారు.

పోలీస్ పటేల్ కుటుంబం

రేవంత్ వాళ్లది పోలీస్ పటేల్ కుటుంబం.ఆయన పెద్దన్న భూపాల్ రెడ్డి ఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యారు. క్రిష్ణారెడ్డి రెండోవారు. తిరుపతిరెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ఇంచార్జి. ఇక జగదీశ్వర్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. కొండల్ రెడ్డి, క్రిష్ణారెడ్డి హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తున్నారు. కొండల్ రెడ్డి అయితే.. అచ్చం రేవంత్ లాగే ఉంటారని చెబుతారు. కాగా, రేవంత్ సోదరుల్లో ఒకరు ఇటీవలి ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరించారు. అయితే ఆయన సొంత సోదరుడా? కజినా? అనేది తెలియరాలేదు.

రేవంత్ కు తోడునీడగా..

ఏ వ్యక్తి విజయానికైనా కుటుంబ పాత్ర కీలకం. కుటుంబంలో నిజాయతీగా పైకి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నవారికి ఆర్థికంగా అనే కాదు.. శారీరకంగా, మానసికంగానూ అండగా నిలిస్తే వారు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సోదరులంతా ఇలానే రేవంత్ కు అండగా నిలిచారని చెబుతారు. ఏడుగురు అన్నదమ్ములూ ఒక్కమాట నిలుస్తూ ముందుకుసాగుతారని తెలిసినవారు వివరిస్తారు. రాజకీయాల్లో రేవంతే ఒక సైన్యం అయితే.. అతడి సైన్యం అన్నదమ్ములు అని చెబుతారు. కాగా, ఏడుగురు అన్నదమ్ముల మధ్య ఒక్క సోదరి ఎంత లక్కీనో కదా..?

వైఎస్ కుటుంబం 700.. రేవంత్ 300

ఉమ్మడి ఏపీలో అత్యంత బలమైన నాయకుడు ఎడుగూరి సందింటి (వైఎస్) రాజశేఖర్ రెడ్డి. వీరిది అతిపెద్ద కుటుంబం. వివిధ సందర్భాల్లో వారు చెప్పినదాని ప్రకారమే వైఎస్ కుటుంబ సభ్యుల సంఖ్య 700. వైఎస్ పుల్లారెడ్డి నుంచి చూస్తే.. ఆయన కుమారుడు వెంకటరెడ్డి.. ఈయన కుమారులు పెదకొండారెడ్డి, పురుషోత్తంరెడ్డి, రాజారెడ్డి. ఇక రాజారెడ్డి ఐదుగురు కుమారుల్లో జార్జిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి మనకుతెలిసినవారే. వీరి వారసులు అందరినీ కలిపితే 700 మందిపైనే ఉంటారని లెక్క. అలాగే, తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ కుటుంబం కూడా పెద్దదే. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. రాజకీయాల్లో ఉన్నందున ఏ కార్యక్రమం చేపట్టినా, వందలు వేలమంది వస్తారు. దీంతోనే ఆయన ఇంట్లో కార్యక్రమాలను కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకొంటామని చెప్పారు. తమ ఫ్యామిలీ మెంబర్లే 300 మంది అవుతారని వివరించారు.