Begin typing your search above and press return to search.

ఆ నాలుగింటితో రేవంత్ కు తలబొప్పి !

లోక్ సభ ఎన్నికల విజయావకాశాలపై ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ తయారు చేసిన నివేదికను పీసీసీకి అందజేసింది

By:  Tupaki Desk   |   22 May 2024 9:30 AM GMT
ఆ నాలుగింటితో రేవంత్ కు తలబొప్పి !
X

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ పాలిట ముళ్ల కిరీటంలా మారుతున్నాయా ? పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా చేపట్టిన చేరికలు బూమ్ రాంగ్ అయ్యాయా ? పార్టీలో కొత్తగా చేరిన నాయకులకు, పాత నాయకులు, పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ లోపంవల్ల లోక్ సభ ఎన్నికల్లో నష్టం జరిగినట్టు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ వ్యాఖ్యానించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నది. లోక్ సభ ఎన్నికల విజయావకాశాలపై ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ తయారు చేసిన నివేదికను పీసీసీకి అందజేసింది. దీనిని అధిష్టానానికి పంపనున్నట్లు చెబుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి, వరంగల్ స్థానాల అభ్యర్థిత్వాలను బీఆర్ఎస్ పార్టీ నుండి చేరిన వారికి కట్టబెట్టారు. ఈ చేరికలు పూర్తిగా రేవంత్ ఇష్టపూర్తిగా జరిగినవి కావడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఈ నాలుగింటిలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ను పార్టీలోకి తీసుకుని సికింద్రాబాద్ ఎంపీగా నిలబెట్టారు. అసలు అక్కడ దానం సరిగ్గా ప్రచారమే చేయలేదన్న వాదన ఉంది. ఇక చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డిని, బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ గా ఉన్న సునీతా మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని చేవెళ్ల, మల్కాజ్ గిరి అభ్యర్థులుగా నిలబెట్టారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరిని, బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్యను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టడం కలకలం రేపింది.

వీరంతా సీఎం రేవంత్‌రెడ్డి ప్రోదల్బంతో పార్టీమారారు. అధిష్ఠానాన్ని ఒప్పించి వీరికి టికెట్లు ఇప్పించింది కూడా ఆయనే. ఈ పారాచ్యూట్‌ నాయకులను అభ్యర్థులుగా బరిలోకి దింపడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ చర్యను సీనియర్‌ నాయకులు హనుమంతరావు, నిరంజన్‌, జడ్సన్‌ బాహాటంగానే వ్యతిరేకించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గేకు టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఫిర్యాదు చేశారు. ఇదే అంశంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ బక్క జడ్సన్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

ఈ నాలుగు స్థానాలలో విజయం సాధించే అవకాశాలు లేకపోవడంతో రేవంత్ కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీలో ఉన్న నేతలను కాదని కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇవ్వడం, నాలుగు నెలల ముందు పార్టీతో తలపడిన వ్యక్తులకు అభ్యర్థిత్వాలను ఖరారు చేయడం వంటి అంశాలు పార్టీలో ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. గెలిస్తే రేవంత్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఓడిపోతే మాత్రం అన్ని వేళ్లూ రేవంత్ వైపే చూయిస్తాయి.