Begin typing your search above and press return to search.

రేవంత్ స్పీడ్ మామూలుగా లేదుగా?

కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రికి ఉండే పరిమితుల లెక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   26 Jan 2024 4:59 AM GMT
రేవంత్ స్పీడ్ మామూలుగా లేదుగా?
X

కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రికి ఉండే పరిమితుల లెక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధిష్ఠానం గీసిన గీతను దాటకుండా.. ఎవరిని నొప్పించకుండా పాలన సాగించటం ఒక ఎత్తు అయితే.. ప్రజల్లో ముద్ర వేసేలా ప్రభుత్వాన్ని రన్ చేయటం అంత సాధ్యమయ్యే పని కాదు. అందునా అత్తెసరు మెజార్టీతో సర్కారును దౌడు తీయించటం సవాళ్లతో కూడుకున్న పని. అయితే.. అలాంటి పరిమితుల మధ్య కూడా తన మార్క్ ను చాటుతున్న రేవంత్ తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

ముఖ్యమంత్రి హోదాలో తన తొలి విదేశీ పర్యటనను ముగించుకు వచ్చిన రేవంత్.. దావోస్ లో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. దానికి నిదర్శనంగా మాజీ మంత్రి కేటీఆర్ విసుర్లు.. ఫస్ట్రేషన్ చూస్తేనే అర్థమవుతుంది రేవంత్ ఏం సాధించాడో. ఎలాంటి అంచనాలు లేకుండా దావోస్ వెళ్లిన రేవంత్.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ.. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని రాష్ట్రానికి తెచ్చే విషయంలో విజయం సాధించారు.

దావోస్ టూర్ తర్వాత రాష్ట్రానికి చేరుకున్న ఆయన కాసింత అనారోగ్యానికి గురైనట్లు చెబుతారు. రెండు.. మూడు రోజులు ఆగినంతనే ఆయన తీసుకుంటున్న వరుస నిర్ణయాలు సంచలనాలుగా మారుతున్నాయి. అన్నింటికి మించి.. పాలనా పరంగా ప్రదర్శిస్తున్న దూకుడు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గవర్నర్ తో భేటీ కావటం.. ఆమెను ఒప్పించి.. ఎమ్మెల్సీ ఎంపికల ప్రక్రియను పూర్తి చేయటం.. ఆ పని ఒకవైపు చేస్తూనే మరోవైపు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ తో పాటు.. సభ్యుల ఎంపికను పూర్తి చేయటం.. మరోవైపు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలక్రిష్ణ ఇంట్లో ఏసీబీ దాడులు.. సీఎం భద్రతా సిబ్బందిలో ప్రక్షాళన.. వాహనాల కాన్వాయ్ ను మార్చేయటం..నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటులో ముందడుగు.. బ్రిటిష్ హైకమిషనర్ తో భేటీ కావటమే కాదు హైదరాబాద్ లోని మూసీకి కొత్త రూపును తెచ్చే ప్రక్రియలో తాను సీరియస్ గా ఉన్నానన్న వరుస సంకేతాలు.. మెట్రో ఫేజ్ 2కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటం.. ఇలా చెప్పుకుంటూ పోతే రెండు.. మూడు రోజుల్లో ఇన్నేసి నిర్ణయాలు తీసుకోవటం అంటే.. పాలనా రథాన్ని ఎంత వేగంగా పరుగులు తీస్తున్నది అర్థమవుతుంది.

ఓవైపు పార్టీని బ్యాలెన్సు చేస్తూనే.. మరోవైపు ప్రభుత్వాన్ని పరుగులు తీయించటం.. ఇంకో వైపు విపక్ష బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బలు తగిలేలా ప్లానింగ్ చేస్తున్న రేవంత్ వైనం చూస్తే.. తాను వేసే ప్రతి అడుగులోనూ ఆచితూచి అన్నట్లుగా జాగ్రత్తలు తీసుకుంటూనే.. మరోవైపు అమితమైన వేగాన్ని ప్రదర్శించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏమైనా.. ఇంత వేగాన్ని అంచనా వేయలేని విపక్షమే కాదు.. స్వపక్షం సైతం షాక్ తింటున్నట్లుగా తెలుస్తోంది. రేవంతా మజాకానా?