Begin typing your search above and press return to search.

తొలి ప్రజాదర్బార్ కు దరఖాస్తులెన్ని? ఎక్కువగా వచ్చినవెన్ని?

ఈ క్రమంలో పలువురు తాము ఏళ్లకు ఏళ్లుగా ప్రగతిభవన్ కు వస్తున్నా.. ఎవరూ పట్టించుకున్నది లేదని చెప్పటం గమనార్హం.

By:  Tupaki Desk   |   9 Dec 2023 3:52 AM GMT
తొలి ప్రజాదర్బార్ కు దరఖాస్తులెన్ని? ఎక్కువగా వచ్చినవెన్ని?
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి రోజునే.. ప్రజాభవన్ గా మారిన నాటి ప్రగతి భవన్ లో ప్రజాదర్బార్ ను ఏర్పాటు చేయటమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు సీఎంకు చెప్పుకోవాలనుకునే వారు రావొచ్చన్న బహిరంగ ప్రకటనను చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ కు వందలాది మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. ఉదయం మొదలైన ప్రజాదర్బార్ కు ముఖ్యమంత్రి రేవంత్ హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రులు పొంగులేటి.. సీతక్కలు ఉన్నారు. దాదాపు 55 నిమిషాల పాటు అక్కడే ఉండి.. ప్రజల నుంచి వినతిపత్రాల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు తొలుతఅవకాశం కల్పించారు. అనంతరం పెద్ద వయస్కుల వినతుల్ని స్వీకరించారు.

ఈ క్రమంలో పలువురు తాము ఏళ్లకు ఏళ్లుగా ప్రగతిభవన్ కు వస్తున్నా.. ఎవరూ పట్టించుకున్నది లేదని చెప్పటం గమనార్హం. ప్రతి ఒక్కరిని పలుకరించటం.. పెద్దమ్మా.. అక్కా.. చెల్లి.. అన్న అంటూ సీఎం రేవంత్ వారిని అప్యాయంగా పలుకరిస్తూ.. వినతులు తీసుకోవటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రజాదర్బార్ కు సంబంధించిన వివరాల్ని ముఖ్యమంత్రి రేవంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘‘కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజాదర్బార్ సాగింది. జనం నుంచి ఎదిగి.. ఆ జనం గుండె చప్పుడు విని.. వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావటానికి మించిన త్రప్తి ఏముంటుంది?’’ అంటూ తన అనుభవాన్ని పోస్టు రూపంలో పెట్టారు. ప్రజాదర్బార్ లో 55 నిమిషాలుఉన్న సీఎం తర్వాత రివ్యూ కోసంసచివాలయానికి వెళ్లిపోయారు. అయినప్పటికీ మంత్రి సీతక్క దాదాపు నాలుగు గంటలపైనే ఉండి.. ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించారు.

ఒక అంచనా ప్రకారం 2వేలకు పైగా వినతులు తొలి రోజున వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని 120మంది సభ్యులతోకూడిన టీం ఒకటి డిజిటలైజ్ చేయటమే కాదు.. ప్రతి సమస్యకు ఒక యూనిక్ నెంబరును కేటాయించటం.. వినతి ఇచ్చిన వారి ఫోన్ కు సందేశాన్ని పంపంటంతో పాటు.. ఆ డేటా మొత్తాన్ని సాయంత్రం 5.30 గంటల వరకు సిద్ధం చేసి సచివాలయానికి పంపటంతో పాటు.. వివిధ జిల్లా కలెక్టరేట్లకు పంపటం గమనార్హం.

వినతులు ఇచ్చినవారిలో అత్యధికులు ధరణి బాధితులే ఎక్కువగా ఉండటం కనిపించింది. ప్రజాభవన్ లోని సీఎం అధికారిక నివాసం పక్కనున్న ఆడిటోరియంలో 320 సీట్లు వేసి కూర్చోబెట్టారు. తాగు నీటి సమస్య లేకుండా ఉండటం కోసం 15వేల వాటర్ బాటిళ్లను సరఫరా చేయటం గమనార్హం. ఇదొక్కటి చాలుప్రజాదర్బార్ కు ఎంత భారీగా ప్రజలు వచ్చారన్నది అర్థం చేసుకోవటానికి. ఎండ తగలకుండా ఉండటానికి క్యూలైన్ల పైన నీడనుకల్పించటంతో పాటు.. ఆరోగ్య సిబ్బందితో వైద్య శిబిరం ఏర్పాటు చేవారు. హెల్ప్ డెస్కు ఏర్పాటు చేయటంతో పాటు.. ప్రజాదర్బార్ కు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేశారు. కీలకస్థాయిల్లో ఉండే డజన్ల కొద్దీ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం చూస్తే.. ప్రజాదర్బార్ కు రేవంత్ సర్కారు ఎంత ప్రాధాన్యతను ఇస్తుందన్న విషయం స్పష్టమవుతుంది.