Begin typing your search above and press return to search.

‘నల్గొండ’ సభ మొత్తానికి ఒక్క మాటతో అంతలా అనేసిన రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలో విరుపు ఎంతలా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 4:13 AM GMT
‘నల్గొండ’ సభ మొత్తానికి ఒక్క మాటతో అంతలా అనేసిన రేవంత్
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలో విరుపు ఎంతలా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాటల మాంత్రికుడన్న పేరు కేసీఆర్ కు ఉంది. ఆయనకు సమానంగా లేదంటే కొన్ని సందర్భాల్లో ఆయనకు మించినట్లుగా మాట్లాడే టాలెంట్ ఒక్క రేవంత్ కు మాత్రమే ఉందని చెప్పాలి. అలాంటి రేవంత్.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంచ్ వేయాలని డిసైడ్ అయితే? ముఖ్యమంత్రిగా ఉన్న తనను ఉద్దేశించి భారీ బహిరంగ సభలో కేసీఆర్ నోటికి పని చెబితే.. దానికి బదులు ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమైంది.

అందరిఅంచనాలకు తగ్గట్లే.. తన ఒక్క మాటతో కేసీఆర్ నల్గొండ సభ స్పీచ్ మొత్తానికి సమాధానం చెప్పేలా సీఎం రేవంత్ వ్యాఖ్యానించటం గమనార్హం. తనను ఉద్దేశించి నల్గొండ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన భాష అనుచితంగా ఉండటమే కాదు.. అభ్యంతరకరంగా ఉందన్న విమర్శల వేళ.. రేవంత్ రియాక్టు అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. గోదావరి జలాల అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. మేడిగడ్డ అంశంలో కొత్తగా వచ్చిన తమ ప్రభుత్వమే తప్పు చేసినట్లు.. తామే బాధ్యత వహించాలన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

‘‘పదే పదే భాష.. మాటలపై సభలో చర్చ జరుగుతోంది. నల్గొండ సభలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలపై రచ్చ చేద్దామా? కేంద్ర మంత్రి.. ముఖ్యమంత్రి.. ఎంపీ.. ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి.. సీఎంపై అలాంటి భాష మాట్లాడతారా? ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదు. ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలాంటి భాష వాడతారా?కేసీఆర్.. హరీశ్ రావుకే పెత్తనం ఇస్తాం. మేడిగడ్డలో నీళ్లు నింపి అక్కడి నుంచి అన్నారం.. సుందిళ్లలో ఎత్తిపోయించే బాధ్యత మీరే తీసుకోండి’’ అంటూ సంచలన సవాలు విసిరారు.

‘‘రూ.94వేల కోట్లు వ్రథా అయి ప్రాజెక్టే దెబ్బ తింటే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సభకు రాకుండా ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడొచ్చా? చర్చకు సిద్ధమైతే.. బీఆర్ఎస్ పక్ష నేతను సభకు రమ్మని చెప్పండి. రేపు సాయంత్రం వరకు చర్చ చేపట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు దిమ్మ తిరిగేలాంటి వ్యాఖ్య ఒకటి చేశారు. నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తనపై విరుచుకుపడిన కేసీఆర్ కు ఒక్క మాటతో పంచ్ ఇచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది. ‘‘చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? ఆ అవసరం మాకేంటి?’’ అంటూ చేసిన వ్యాఖ్య నాకౌట్ పంచ్ లా మారిందంటున్నారు. సానుభూతి కోసం వీల్ ఛైర్ నాటకాలు ఆడుతున్నారని.. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడకపోతే చర్చకు రావాలన్న ముఖ్యమంత్రి రేవంత్.. ‘‘సభకు రాకుండా అక్కడెక్కడో ప్రగల్భాలెందుకు?’’ అంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యకు కేసీఆర్ సమాధానం ఎలా ఉండనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.