Begin typing your search above and press return to search.

షర్మిలను సీఎం చేస్తా.. .జగన్ పైన రేవంత్ నిప్పులు ...!

మరో వైపు ఇదే సభలో ప్రసంగించిన వైఎస్ షర్మిల తన అన్న జగన్ మీద మండిపడ్డారు. దేనికి సిద్ధం అంటున్నావో చెప్పాలని నిలదీశారు.

By:  Tupaki Desk   |   16 March 2024 3:31 PM GMT
షర్మిలను సీఎం చేస్తా.. .జగన్ పైన  రేవంత్  నిప్పులు ...!
X

వైఎస్ షర్మిలకు తాను తోడు ఉంటాను అన్నారు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీకి ఆమె సీఎం అయ్యేంతవరకూ తాను ఆమెకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. ఏపీ బాగుపడాలీ అంటే షర్మిల సీఎం కావాల్సిందే అని ఆయన అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన న్యాయ సాధన సభకు ముఖ్య అతిధిగా హాజరైన రేవంత్ రెడ్డి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మీద జగన్ మీద నిప్పులు చెరిగారు.

అదే టైం లో కాంగ్రెస్ ని గెలిపించాలని గట్టిగా ప్రజలకు పిలుపు ఇచ్చారు. వైఎస్సార్ ఆశయాలను పంచుకున్న వారే ఆయనకు అసలైన వారసులు అని ఆయన అన్నారు ఆ విధంగా చూస్తే వైఎస్సార్ బిడ్డ షర్మిల ఆయనకు వారసురాలు అని అన్నారు. షర్మిలకు ఏపీ ప్రజలు బలం ఇవ్వాలని చట్ట సభలలో పాతిక ఎమ్మెల్యేలు అయిదు ఎంపీ సీట్లు ఇవ్వండి చాలు ఆమె మీ అందరి తరఫున నిలబడుతుంది అని రేవంత్ చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని, అలాగే ఏపీకి రాజధాని అన్నది ఎక్కడో తెలియదు స్టీల్ ప్లాంట్ ని తెగనమ్ముతామన్నా అడిగే దిక్కే లేదని మండిపడ్డారు. ఏపీలో చంద్రబాబు జగన్ విరోధులు కానీ ఢిల్లీకి వెళ్తే మాత్రం ఇద్దరూ మోడీ పక్కనే ఉంటారని ఆయన విమర్శించారు.

వైసీపీకి టీడీపీకి ఓటేస్తే మాత్రం ఏపీలో ఉన్న పాతికకు పాతిక ఎంపీ సీట్లూ మోడీ ఖాతాలోనే పడతాయని అన్నారు. గల్లీలో కొట్లాట ఢిల్లీలో దోస్తానా అని టీడీపీ వైసీపీల మీద విమర్శించారు. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని ఆయన సెటైర్లు పేల్చారు. వీరిని గెలిపిస్తే అంతా మోడీ గారి దొడ్లోకే పోతారని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పాలకులు విశాఖ ఉక్కుని అంగుళం కూడా కదిలించలేరని, వారిని అడ్డుకుని తీరుతామని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇక ఏపీలో పాలించే వైసీపీ వారు మోడీకి లొంగిపోయారు అని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో నీలం సంజీవరెడ్డి పీవీ నరసిం హారావు, ఎంటీఆర్, వైఎస్సార్, ఎం వెంకయ్యనాయుడు, ఎస్ జైపాల్ రెడ్డి వంటి వారు తెలుగు నేల నుంచి గెలిచి ఢిల్లీ వెళ్లి కేంద్ర పాలకులను నిలదీసి ఏపీ ప్రయోజనాలకు కాపాడారని ఆయన గుర్తు చేశారు.

ఇపుడు అటువంటి పరిస్థితి ఉందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మళ్లీ అంతా మారాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇదే సందర్భంలో వైఎస్సార్ ని ఆయన గుర్తు చేశారు. కేవలం 26 సీట్లకు కాంగ్రెస్ పడిపోయిన వేళ ఆనాడు వైఎస్సార్ కి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారని, ఆయన మండుటెండలో పాదయాత్రను చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాకా చేశారని, ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

ఏపీలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది అని అడిగే వారికి ఒక్కటే జవాబు. కాంగ్రెస్ ప్రజల గుండెలలో ఉంది అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ని గెలిపించుకునే వివేకం ప్రజలకు ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రతీ గెలుపు వెనకాల పేదలు ఉన్నారని, అలగే పేదల కోసం పోరాడే ఎర్ర జెండాలు కూడా ఉన్నాయని అందువల్ల కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ కి అండగా ఉంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సభకు హాజరైన సందర్భంలో ఆయనకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేవంత్ ని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఆయనకు ఈలలతో గోలలతో స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డికి ఏపీలో కూడా ఇంతటి క్రేజ్ ఉందా అన్న చర్చ కూడా సాగింది.

మరో వైపు ఇదే సభలో ప్రసంగించిన వైఎస్ షర్మిల తన అన్న జగన్ మీద మండిపడ్డారు. దేనికి సిద్ధం అంటున్నావో చెప్పాలని నిలదీశారు. ఆరు వందల కోట్లు ప్రజా ధనం వెచ్చించి సిద్ధం సభలు జరిపారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదాను పోలవరాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రానికి తాకట్టు పెట్టడానికి జగన్ సిద్ధమా అని ఆమె వెటకారం చేశారు.

సంపూర్ణ మద్య పాన నిషేధం పేరు చెప్పి మహిళలను అలాగే రెండున్నర లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఆమె మండిపడ్డారు. జగన్ కి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.