Begin typing your search above and press return to search.

రేవంత్ సంచలనం: డిసెంబరు 3.. హైదరాబాద్ విమోచన దినం సేమ్!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట సంచలన వ్యాఖ్యలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   17 March 2024 1:22 PM GMT
రేవంత్ సంచలనం: డిసెంబరు 3.. హైదరాబాద్ విమోచన దినం సేమ్!
X

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు వీలుగా ఆయన సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబరు మూడో తేదీని సీఎం రేవంత్ పోల్చిన పోలిక ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.

నిజాం పాలనతో కేసీఆర్ పాలనను పోలుస్తూ రేవంత్ చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తే.. ‘‘ఏడు తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లబించినట్లే.. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి.. ప్రజలకు విముక్తి లభించింది. ఎన్ని మంచి పనులు చేసినా బానిసలుగానే చూశారు. స్వేచ్ఛను లాక్కున్నారు. నిజాం ప్రజల ఆగడాలను తట్టుకోలేకనే నాడు తిరుగుబాటు చేస్తే.. నేడు గులాబీ నేతల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నారు. స్వేచ్ఛను లాక్కుంటే ఊరుకునేది లేదు’’ అంటూ అసలు పాయింట్ ను తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ‘‘నిజాం, కేసీఆర్ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు. కానీ సారూప్యత ఒకటే’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే.. తమ పదేళ్ల పాలనలో గొప్ప పనులు చేశామన్న ధోరణిలో గులాబీ అధినాయకత్వం ఉంటే.. సీఎం రేవంత్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎక్కువమంది రాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీ మీద ఏ తరహా అభిప్రాయంతో ఉన్నారో.. అవే అంశాల్ని మరింత సూటిగా ప్రస్తావించటం గమనార్హం. కేసీఆర్.. కేటీఆర్ లు పలు మార్లు చెప్పుకున్నట్లుగా వారి ప్రభుత్వం అద్భుతమైన పనుల్ని చేసినప్పుడు.. ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న కోణంలో ఆత్మవిమర్శ చేసుకోవటం అతి పెద్ద లోపంగా చెప్పాలి.

ఈ కీలక అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తించారని చెప్పాలి. అందుకే.. ఏ అంశాల్ని ప్రస్తావిస్తే ప్రజలు ఇట్టే కనెక్టు అవుతారో.. వాటినే తరచూ ప్రస్తావిస్తుంటారు ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి. ఇందులో భాగంగానే తాజా వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజాం హయాంలో ఖాసిం రజ్వీ అధిపత్యాన్ని చలాయించాలని కేసీఆర్ భావించినట్లుగా రేవంత్ వ్యాఖ్యలు చేశారు.

ఖాశీం రజ్వీ మీద ప్రజలు చేసిన పోరాటంలో తరహాలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలన్న భావనతో ఎన్నికల్లో ప్రజలు తీర్పును ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ మీదా రేవంత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘బతుకమ్మ పండుగను కొందరు వ్యాపార వస్తువుగా, ఆటవస్తువుగా మార్చారు. బతుకమ్మ.. బోనాలు అనాదిగా తెలంగాణలో జరుపుకుంటున్న పండుగలు. ఎవరు ఉన్నా లేకున్నా ఈ పండుగలు జరుగుతాయి. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం. ధరణి పోర్టల్ ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది. తప్పులకు కారణమైనోళ్లను ఉపేక్షించేది లేదు’’ అంటూ తనదైన శైలిలో రేవంత్ హెచ్చరించారు.