Begin typing your search above and press return to search.

తన ఓటమి ఎప్పుడో చెప్పేసిన రేవంత్

ఇంతకూ ఆయనేమన్నారంటే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో 14 ఎంపీ స్థానాల్ని గెలవటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 4:51 AM GMT
తన ఓటమి ఎప్పుడో చెప్పేసిన రేవంత్
X

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన నోటి నుంచి వచ్చే మాట విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి.. తాజాగా తన నియోజకవర్గమైన కొడంగల్ లో రూ.4360 కోట్ల విలువైన డెవలప్ మెంట్ పనులనకు శంకుస్థాపన చేపట్టారు.ఇందుకు కోస్గి పట్టణం వేదికైంది. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాటపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీనేతలకు.. క్యాడర్ కు టార్గెట్ ఇచ్చే క్రమంలో సీఎం రేవంత్ నోటి నుంచి వచ్చిన మాట రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.

ఇంతకూ ఆయనేమన్నారంటే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో 14 ఎంపీ స్థానాల్ని గెలవటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇక్కడితో ఆగినా ఫర్లేదు కానీ.. రేవంత్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. మొత్తం పదిహేడు స్థానాల్లో 14 స్థానాల్లో గెలిచిప్పుడే మనం గెలిచినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మీద బీఆర్ఎస్.. బీజేపీలు కుట్ర చేశాయని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ ప్రజల అప్రమత్తంగా ఉండి తమను గెలిపించారన్నారు. ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు అత్యధిక నష్టం జరిగిందన్న రేవంత్.. వచ్చే ఎన్నికల్లో గెలుపు సీట్లపై చేసిన వ్యాఖ్యలకు ఆయన తర్వాతి కాలంలో సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితిని కొని తెచ్చుకున్నారన్న మాట వినిపిస్తోంది.

నేతలు.. కార్యకర్తలకు ఉత్తేజపరిచేందుకు వీలుగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారని.. అందుకే ఆయన మాటల్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే.. ముఖ్యమంత్రే స్వయంగా తన ఓటమి లెక్కను చెప్పేయటం అవసరం లేదంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఇదే సభలో మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యుద్ధం అయిపోలేదని.. ఇది కేవలం విరామంగా పేర్కొన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 17 స్థానాలకు 14 స్థానాల్లో విజయం సాధించాలని.. అప్పుడే పార్లమెంటులో పట్టు సాధిస్తామని పేర్కొన్నారు. పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించటమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధంలో గెలిచినట్లుగా అభివర్ణించారు.

తాను చెప్పినట్లుగా 14 స్థానాల్లో విజయం సాధించినప్పుడే తెలంగాణ కాంగ్రెస్ కు గొప్పదనం.. కొడంగల్ కు గౌరవం దక్కుతాయని వ్యాఖ్యానించారు. గతంలో కరీంనగర్ లో ఓడిపోతానేమోనని.. మహబూబ్ నగర్ జిల్లాకు వలస వచ్చిన కేసీఆర్.. పాలమూరు ఎంపీగా గెలిపించినందుకే ఆయన తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కిందన్నారు. మరి.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరుకు ఏం చేశారు? పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కాంట్రాక్టర్ కు కట్టబెట్టి కమిషన్లు తీసుకున్నారే తప్పించి ఇంకేం ఒరగబెట్టలేదన్నారు. పాలమూరు ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు.

చిన్నారెడ్డి ప్రారంభించిన ఉద్యమంలో కేసీఆర్ దూరి తెలంగాణను దోచుకున్నారన్న రేవంత్.. "ఇప్పుడు ప్రజలు ఛీకొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా అల్లుడు నల్గొండ నుంచి.. కొడుకు మహబూబ్ నగర్ నుంచి పాదయాత్ర చేపడతారట. మళ్లీ పాలమూరు జిల్లాకు ఎందుకు వస్తారు? జిల్లాలోని పలు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు? 2014 ఎన్నికల్లో పాలమూరు గడ్డ వేదికగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తానని మోడీ చెప్పారు. ఇప్పుడు కిషన్ రెడ్డిని.. డీకే అరుణను.. జితేందర్రెడ్డిలను అడుగుతున్నా.. జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు?" అని ప్రశ్నించారు.