Begin typing your search above and press return to search.

రేవంత్ ఇంత ధైర్యంచేస్తారా ?

పది కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే విషయంలో తన ప్రతిపాదనను ఆల్రెడీ ఏఐసీసీ పెద్దలకు పంపించారట.

By:  Tupaki Desk   |   14 March 2024 1:30 PM GMT
రేవంత్ ఇంత ధైర్యంచేస్తారా ?
X

పార్లమెంటు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పెద్ద సాహసం చేయబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రేవంత్ చేయబోయే సాహసం ఏమిటంటే పది కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించేందుకు రెడీ అయ్యారట. పది కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే విషయంలో తన ప్రతిపాదనను ఆల్రెడీ ఏఐసీసీ పెద్దలకు పంపించారట. అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటిస్తారని సమాచారం. ఈ ఛైర్మన్లుగా రేవంత్ సిఫారసు చేసిన పేర్లలో ఎక్కువగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశంలేని వాళ్ళు ఉన్నారన్నది పార్టీవర్గాల సమాచారం.

నిజానికి కార్పొరేషన్ల భర్తీని పార్లమెంటు ఎన్నికల తర్వాత మాత్రమే చేయాలని ఒకపుడు రేవంత్ అనుకున్నారు. ఎన్నికలకు ముందు ఛైర్మన్లను భర్తీచేస్తే పదవులు ఆశించి రానివాళ్ళు వ్యతిరేకమవుతారని అనుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా తయారయ్యే నేతలతో పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదని అంచనా వేశారు. ఎందుకంటే ప్రతి పోస్టుకు పదిమంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఛైర్మన్ గా ఒక్కళ్ళని మాత్రమే నియమించే పరిస్ధితిలో మిగిలిన తొమ్మిదిమందిలో చాలామంది పార్టీకి వ్యతిరేకమయ్యే అవకాశముంది.

సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇలాంటి కంపంతా పార్టీకి అవసరమా అని రేవంత్ మొదట్లో అనుకున్నారు. పార్టీలోని సీనియర్లు కూడా ఇదే విషయాన్ని అప్పట్లో రేవంత్ కు చెప్పారట. అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో నేతల పనితీరు ఆధారంగానే కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పారు. అలాంటిది సడెన్ గా ఇపుడు పది కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఎందుకు నియమించాలని అనుకున్నారో అర్ధంకావటంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన సామాజికవర్గాల సమీకరణలనే ప్రతి సందర్భంలోను అనుసరించాలని డిసైడ్ అయ్యారు.

మంత్రివర్గ కూర్పు, ప్రభుత్వ సలహదారుల నియామకం, రేపటి పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక ఇలా ఏది తీసుకున్నా సామాజికవర్గాల సమతూకాన్ని రేవంత్ పాటిస్తున్నారు. యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ విభాగాల ఛైర్మన్లు, టికెట్లు దక్కని సీనియర్లంతా కార్పొరేషన్, నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి చేస్తున్న సాహసం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.