Begin typing your search above and press return to search.

రాములోరి ముత్యాల తలంబ్రాల్ని సీఎం రేవంత్ తెస్తారా? లేదా?

అందుకు భిన్నంగా తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ముత్యాల తలంబ్రాల్ని రాములోరి కల్యాణానికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   14 March 2024 4:18 AM GMT
రాములోరి ముత్యాల తలంబ్రాల్ని సీఎం రేవంత్ తెస్తారా? లేదా?
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ.. భద్రాచలం రామలోరి ఆలయం లెక్క కాస్త వేరు. ప్రతి ఏటా శ్రీరామనవమి వేళ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వారు కుటుంబ సమేతంగా స్వామివారి కల్యానానికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాల్ని, పట్టువస్త్రాల్ని తీసుకెళ్లటం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేళ్లు పదవిలో ఉన్నప్పటికి శ్రీరామనవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాల్ని తీసుకెళ్లిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించే పరిస్థితి.

అందుకు భిన్నంగా తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ముత్యాల తలంబ్రాల్ని రాములోరి కల్యాణానికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే.. ఆయనకు ఎన్నికల కోడ్ అడ్డు పడనుంది. ఈ నెల 17న శ్రీరామ నవమి అన్న సంగతి తెలిసిందే. అయితే.. పదిహేనో తేదీ నాటికి లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. అదే జరిగితే.. ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ వర్తించదు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి వేళ.. ముత్యాల తలంబ్రాలతో ముఖ్యమంత్రి వస్తారా? లేరా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే.. ఈసారి జరిగే రాములోరి కల్యాణానికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ హాజరుకావాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అడ్డుగా ఉన్న ఎన్నికల కోడ్ విషయమై ఎన్నికల అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్లుగా చెబుతున్నారు. శతాబ్దాలుగా ఆనవాయితీగా ఉన్న అంశానికి సంబంధించి ఎన్నికల కోడ్ ను వర్తింపచేయకుండా అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం తరఫున విన్నవించుకోనున్నట్లు చెబుతున్నారు. ఈ వినతికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందిస్తే సీఎం రేవంత్ భద్రాచలానికి ఖాయంగా వెళతారని తెలుస్తోంది. ఒకవేళ అనుమతి రాకుంటే ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ కమిషన్ తో పాటు ముఖ్యమైన అధికారులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు.