Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ ప్రెస్ మీట్ వేళ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించిందట!

తాజాగా తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా భేటీని నిర్వహించటం తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Dec 2023 11:03 AM GMT
సీఎం రేవంత్ ప్రెస్ మీట్ వేళ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించిందట!
X

మార్పు నినాదంతో ఎన్నికల ప్రచారానికి దిగిన కాంగ్రెస్.. వారి అంచనాలకు తగ్గట్లే మార్పు మంత్రం పని చేసి.. ఎప్పటికి వస్తుందో అనుకున్న అధికారం చేతికి వచ్చింది. అదే సమయంలో హ్యాట్రిక్ సీఎం ఖాయమన్న కలల్ని కల్లలు చేయటంలో మార్పు మాట కీలక పాత్ర పోషించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి దగ్గర దగ్గర మూడు వారాలు పూర్తి అయ్యాయి. మరి.. మార్పు ఎవరికి కనిపించినా.. కనిపించకున్నా.. జర్నలిస్టులకు మాత్రం కొట్టొచ్చినట్లుగా కనిపించిందన్న మాట సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పదే పదే చర్చకు వస్తోంది.

తాజాగా తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా భేటీని నిర్వహించటం తెలిసిందే. ఆరు గ్యారెంటీల లోగో ఆవిష్కరణతో పాటు.. దరఖాస్తులకు సంబంధించిన వివరాలు.. ఇతర అంశాల గురించి మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన భేటీ అనంతరం ఆసక్తికర చర్చ జర్నలిస్టుల మధ్య జరిగింది. పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన నిర్వహించే మీడియా భేటీలు ఏ తీరులో ఉంటాయన్న విషయం తెలిసిందే. అదే సమయంలో రేవంత్ మీడియా భేటీ పూర్తి భిన్నంగా సాగటంతో సరికొత్తగా అనిపించటమే కాదు.. మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించిందని చెప్పాలి.

ఒక సీనియర్ జర్నలిస్టు సోషల్ మీడియాలో రాసిన అనుభవాన్ని చూసినప్పుడు.. మీడియా భేటీకి హాజరైన పలువురు రిపోర్టర్ మిత్రులంతా నిజమే.. తాము కూడా ఇదే ఫీల్ అయ్యామని చెప్పుకోవటం కనిపించింది. అందుకే.. ఈ 'మార్పు' పోస్టును అందరితో పంచుకోవాలనిపించింది. ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకూడదన్న ఉద్దేశంతో.. సోషల్ మీడియాలో పోస్టు చేసిన పోస్టును యథాతధంగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే.. సమాజానికి వాచ్ డాగ్స్ గా అభివర్ణించే జర్నలిస్టులకు రేవంత్ సర్కారులో మార్పు ఎంతలా కనిపించిందన్నది కూడా ప్రజలకు పాయింటే అవుతుంది కదా?

జర్నలిస్టులకు నోళ్లు వచ్చాయోచ్! స్వేచ్ఛ వచ్చింది! సచివాలయం లో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు! రిలాక్స్ అయి ప్రశ్నలపై ప్రశ్నలు అడిగేసారు నేరుగా ముఖ్యమంత్రినే! అవును మీరు చదివింది కరెక్ట్! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వరసగా ప్రశ్నలు అడిగారు! ఆయనలో ఏం తడుముకోవడాలు లేవు! తడబాటు అంతకన్నా లేదు! నవ్వు ఏమాత్రం చెదరలేదు! బెదురూ లేదు! భయపడటాలు లేవు! నోరు నొక్కేయాడాలు అస్సలు లేవు! మైక్ లాక్కోవడాలు అంత కన్నా లేవు!

పక్కనుండి పార్టీ నేతలు ఆపడాలు లేవు! అక్కడ కనిపించింది ఒక్కటే.. ప్రశ్న రావడం ఆలస్యం తటపటాయింపు లేకుండా జవాబు దూసుకు రావడమే! ప్రశ్నను బట్టి జవాబు సెటైర్ రూపం లో వుండింది! సీరియస్ ప్రశ్నకు సీరియస్ మ్యాటర్ దిగింది! ఏదయినా సూటిగా సుత్తి లేకుండా బుల్లెట్ దిగింది అంతే! నిన్న మొట్టమొదటి సారిగా సచివాలయం లో గ్యారంటీ లోగో, దరఖాస్తు పత్రాలు ఆవిష్కరణ మీడియా సమావేశం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి ఆద్యంతం నిలబడి సమాధానాలు ఇవ్వడం విశేషం! అటు మంత్రులు, ఇటు జర్నలిస్టులు కూర్చునే వున్నా, రేవంత్ రెడ్డి నిల్చునే జవాబులు ఇచ్చారు!

'చెప్పండి రాహుల్..' అని రేవంత్ రెడ్డి మొదలు పెట్టగానే హాలు అంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది! ఎందుకంటే గతం లో కెసిఆర్ కూడా ప్రెస్ మీట్స్ లో రాహుల్ తోనే మాట్లాడే వారు! ఇంకెవరు ప్రశ్నలు వేసినా జవాబు సూటిగా ఉండేది కాదు, నీకేం తెలుసు, కూర్చో కూర్చో, ఏ పేపర్ నీది, ఏం పేరు నీది అని కెసిఆర్ అనగానే నోట్లో ప్రశ్న నోట్లోనే నాని పోయేది! బయటకు వచ్చేది కాదు! ఒక్క హిందూ పత్రిక రాహుల్ కు మాత్రమే ఆ స్వేచ్చ ఉండేది! ఆ విషయం దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి కూడా నవ్వుతూ రాహుల్ తోనే మొదలుపెట్టారు!

రాహుల్ తో పాటు ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు సమాధానాలు ఇచ్చారు! అంతే కాదు, మీడియా కోసం సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు. తనతో పాటు మంత్రులు ఇక అక్కడే పత్రికా సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గతంలో జర్నలిస్టులకు సచివాలయం ప్రవేశం లేదని ఎవరో గుర్తు చేయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వారికే కాదు, అప్పటి ఎంపీ అయిన తనకే ఎంట్రీ లేదని, గేటు దగ్గర వెయిట్ చేసి వెనక్కి వెళ్లిన రోజు ఉందని గుర్తు చేశారు. ఇక అలాంటి సమస్య ఉండదని, మీడియా కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.