Begin typing your search above and press return to search.

రేవంత్ సెంట్రిక్‌గా రాజ‌కీయం.. ఆ ఒక్క‌మాటే అస్త్ర‌మా?

రేవంత్‌ను వ్య‌తిరేకించే ఓ వ‌ర్గం ఆయ‌న మాట‌ల‌ను ఆంగ్లంలోకి త‌ర్జుమా చేసి.. కాంగ్రెస్ పెద్ద‌ల‌కు పంపిన‌ట్టు గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

By:  Tupaki Desk   |   6 March 2024 5:03 AM GMT
రేవంత్ సెంట్రిక్‌గా రాజ‌కీయం.. ఆ ఒక్క‌మాటే అస్త్ర‌మా?
X

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్‌, సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగా రాజ‌కీయ దుమారం రేగుతోందా? సొంత పార్టీలోనే ఆయ‌న‌ను దూరం చేసేందుకు కుట్ర‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న లో పాల్గొన్న రేవంత్.. ఆయ‌న‌ను పెద్ద‌న్న‌గా అభివ‌ర్ణించ‌డం.. రాష్ట్రానికి సాయం చేయాల‌ని, కేంద్ర రాష్ట్రాల మ‌ధ్య స‌హ‌క‌రించు కుందామ‌ని చెప్ప‌డం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల వెనుక ఆయ‌న ఉద్దేశం మంచిదే అయినా.. ఎన్నిక‌ల‌కు ముందు రామ‌.. అన్నా విప‌క్షాలు బూతుమాట‌గా ప్ర‌చారం చేసే ప‌రిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో రేవంత్‌ను బూచిగా చూపించే ప్ర‌య‌త్నాలు చాప కింద నీరులా పారుతున్నాయి.

ఏం జ‌రిగింది?

రేవంత్‌ను వ్య‌తిరేకించే ఓ వ‌ర్గం ఆయ‌న మాట‌ల‌ను ఆంగ్లంలోకి త‌ర్జుమా చేసి.. కాంగ్రెస్ పెద్ద‌ల‌కు పంపిన‌ట్టు గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ''మోడీపై మ‌నం యుద్దం చేస్తున్నాం. కానీ, ఇక్క‌డ ఏం జ‌రిగిందో తెలుసుకోండి'' అంటూ.. స‌ద‌రు లేఖ‌లో కొంద‌రు ప్ర‌స్తావించార‌ని.. ఇంత‌క‌న్నా ఎక్కువ‌గానే వ్యాఖ్య‌లుచేశార‌ని అత్యంత విశ్వ‌సనీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రికొంద రు ఈ వ్యాఖ్య‌ల‌ను సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఆదిలాబాద్ స‌భ‌లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల త‌ర్వాత‌.. ఆయ‌న ఏమ‌నుకున్నారో ఏమో.. వెంట‌నే ఓ పత్రికాధిప‌తిని క‌లుసుకున్నారు. దీంతో స‌ద‌రు వ్యాఖ్య‌ల దుమారం త‌గ్గుతుంద‌ని భావించి ఉంటారు.

కానీ, సోష‌ల్ మీడియాలో ప్ర‌ధాని మోడీని కొనియాడ‌డం, పెద్ద‌న్న అంటూ ప్ర‌క‌టించ‌డం వంటివి జోరుగా వైర‌ల్ అయ్యాయి. వీటి వెనుక ఇంటి నేత‌లే ఉన్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు కూడా బావిస్తున్నాయి. ఇదిలావుంటే.. తాజాగా రేవంత్‌రెడ్డిపై బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ మాట తాను పక్కాగా చెబుతున్నానని అన్నారు. ''రేవంత్ రెడ్డి ప్రధానిని ప్రశంసించడం ద్వారా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో... సన్నాసి అంటున్నట్లుగా ఉంది'' అని చెప్పారు.

''ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి బడే భాయ్ అంటున్నారని.. మరి ఆ బడేభాయ్... ఈ ఛోటే‌భాయ్‌కి ఏమిచ్చాడో... చెవిలో ఏం చెప్పాడో తనకు తెలియదు కానీ నిన్నటి ఆదిలాబాద్ సభతో తెలంగాణలో రేవంత్ రెడ్డి భవిష్యత్తు, కాంగ్రెస్ భవిష్యత్తు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్లు.. అసోంలో జరిగినట్లు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయం'' అని కేటీఆర్ వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది. మొత్తానికి కీల‌క‌మైన ఎన్నిక‌లకు ముందు.. రేవంత్ చుట్టూ దుమారం రేగడం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇది టీక‌ప్పులో తుఫానుగా త‌ప్పించుకుంటుందో లేక‌.. పెరుగుతుందో చూడాలి.