Begin typing your search above and press return to search.

జగన్ మానస పుత్రిక లాంటి పధకం రేవంత్ నోటి వెంట....!

అదే విధంగా మా కాంగ్రెస్ నేత, మా ముఖ్యమంత్రి అని వైఎస్సార్ ని కూడా ఆయన తన ప్రసంగాలలో తెచ్చి కీర్తిస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 1:30 AM GMT
జగన్ మానస పుత్రిక లాంటి పధకం రేవంత్ నోటి వెంట....!
X

తెలంగాణా ఎన్నికలు కాదు కానీ ఏపీ నేతలు ప్రభావం అక్కడ బలంగా పడుతోంది. ఇప్పటికే చంద్రబాబును అధికార బీయారెస్ కీర్తిస్తోంది. కేటీయార్ అయితే బాబుని విజనరీ అని అనేక ఇంటర్వ్యూలలో చెబుతూ వస్తున్నారు. ఇక వైఎస్సార్ గ్రేట్ లీడర్ అని కూడా కొనియాడారు. ఇపుడు కాంగ్రెస్ వంతు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే చంద్రబాబు అంటే తనకెంత ఇష్టమో చెప్పేశారు. ఆయన మనసులో ఉన్నది ఏ మాత్రం దాచుకోలేదు

అదే విధంగా మా కాంగ్రెస్ నేత, మా ముఖ్యమంత్రి అని వైఎస్సార్ ని కూడా ఆయన తన ప్రసంగాలలో తెచ్చి కీర్తిస్తున్నారు. ఇపుడు ఏకంగా ఏపీ సీఎం జగన్ మానస పుత్రిక లాంటి ఒక బ్రహ్మాండమైన పధకాన్ని తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా అమలు చేసి చూపిస్తామని ఆయన హామీ ఇచ్చేశారు.

ఇంతకీ ఆ పధకం ఏమిటి, రేవంత్ రెడ్డికి ఎందుకు నచ్చింది. దాన్ని తెలంగాణా ఎన్నికల్లో ఎందుకు ఆయన ఒక వజ్రాయుధం లాంటి హామీగా ప్రయోగిస్తున్నారు అంటే తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. వాలంటీర్ల వ్యవస్థ ఏపీలో సూపర్ డూపర్ గా క్లిక్ అయింది. ఏపీలో ప్రతీ యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నారు. వారే ప్రభుత్వ పధకాలను నేరుగా ప్రజలకు అందిస్తున్నారు. వారే జనంలోకి వెళ్తున్నారు. వారే ప్రభుత్వం గురించి చెబుతూ వస్తున్నారు.

ఇక ప్రజలు ఏ ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగకుడా కూడా చాలా పనులు వాలంటీర్ల ద్వారా అవుతున్నాయి. దీంతో ఈ వ్యవస్థ మీద చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఇపుడు వాలంటీర్ల వ్యవస్థను తాము తెలంగాణాలో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ఇస్తున్న హామీ అయితే రాజకీయ విశేషంగానే అంతా చూస్తున్నారుట.

ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జనగామ నియోజకవర్గం సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏపీలో మాదిరిగానే తెలంగాణాలో కూడా వాలంటీర్ వ్యవస్థను అమలులోకి తెస్తామని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిండం వంటి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని భావించిన కాంగ్రెస్ ఆ పధకాన్ని తామూ అమలు చేస్తామని అంటోంది

ఇక కేవలం గౌరవ వేతనంతో వాలంటీర్లు పనిచేస్తారు. అది నిరుద్యోగ యువతకు ఒక విధంగా ఆర్ధికంగా ఆసరాగా ఉంటుంది. అదే సమయంలో లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని భావించిన కాంగ్రెస్ ఈ మేరకు జగన్ అక్కడ అమలు పరుస్తున్న హామీని ఇక్కడ కూడా చేస్తామని గట్టి హామీ ఇస్తోంది. దీంతో ఏపీలో వైసీపీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పధకాన్ని కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్పడం అంటే ప్రజలలో అది ఎంతలా వెళ్ళింది అన్నది అర్ధం అవుతోందని అంటోంది. వచ్చే ఎన్నికల్లో తమకు అది బాగా లాభిస్తుంది అని కూడా లెక్కలేసుకుంటోంది.

ఇక అధికార బీయారెస్ కూడా ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని విధానాలను తామూ అమలు చేస్తామని అంటోంది. ఉదాహరణకు సామాజిక పెన్షన్ విధానమే తీసుకుంటే రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల్కు జగన్ అయిదేళ్ళ కాలంలో పెంచుతామని హామీ ఇచ్చారు. దాన్ని కేసీయార్ కూడా అందిపుచ్చుకుని 2028 ఎన్నికల్లోగా సామాజిక పెన్షన్ ని అయిదు వేలకు విడతల వారీగా పెంచుతామని హామీ ఇచ్చారు. ఏపీలో బ్రహ్మాండంగా అది అమలు అవుతోందని కూడా బీయారెస్ నేతలు చెప్పుకొచ్చారు. ఒకేసారి ఆర్ధిక భారం పడకుండా ప్రజలకు మేలు చేసే స్కీం గా దీన్ని గుర్తించారు.

ఇదే విధనగ రైతు బంధు పధకాన్ని కూడా విడతల వారీగా అయిదేళ్ళ కాలంలో పెంచుకుంటూ వెళ్తామని చివరి సంవత్సరానికి దాన్ని పదహారు వేల రూపాయల దాకా చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు పరిపాలనా సంస్కరణలు తెలంగాణాలో ఇపుడు గట్టి హామీలుగా మారుతున్నాయి. దీంతో వైసీపీలో కొత్త హుషార్ కనిపిస్తూంటే ప్రతిపక్ష టీడీపీ కూడా వచ్చే ఎన్నికల నాటికి తమ ఎన్నికల ప్రణాళికలో మార్పులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.