Begin typing your search above and press return to search.

అయోధ్యలో రామ మందిరం... రేవంత్ వ్యాఖ్యలు వైరల్!

తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ... అయోధ్య ఆలయంలో రాం లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీ కార్యక్రమంగా అభివర్ణించారు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 5:02 AM GMT
అయోధ్యలో రామ మందిరం... రేవంత్  వ్యాఖ్యలు వైరల్!
X

ఈ నెల 22న ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించనుంది యూపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా సుమారు 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారని తెలుస్తుంది! ఈ కార్యక్రమంపై భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోపక్క ఈ ఆలయ నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభోత్సవం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్నప్పుడే ప్రారంభించడానికి గల కారణాలు అందరికీ తెలిసినవేనంటూ రాజకీయ ప్రత్యర్థులతోపాటు పలువురు స్వామీజీలు సైతం బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

అవును... అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ లో పర్యటిస్తూ... పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటోన్న రేవంత్... తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ... అయోధ్య ఆలయంలో రాం లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీ కార్యక్రమంగా అభివర్ణించారు.

ఇదే సమయంలో... అయోధ్య ఆలయంలో రాంలల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ సొంత కార్యక్రమంగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. రామాలయం ప్రతి ఒక్క హిందువుకూ చెందుతుందని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని బీజేపీ మాత్రం రాజకీయంగా వాడుకుంటోందని ఫైరయ్యారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి వెళ్లదలచుకోలేదని తెలిపారు.

అదేవిధంగా... అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి కాలేదని గుర్తుచేసిన రేవంత్... అసంపూర్తిగా ఉన్నప్పుడే ప్రారంభించడానికి గల కారణాలు అందరికీ తెలిసినవేనని వ్యాఖ్యానించారు. రామ మందిరాన్ని, హిందూయిజాన్ని అడ్డుగా పెట్టుకుని మత రాజకీయాలకు పాల్పడుతోందంటూ బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు.

అనంతరం మరింత స్ట్రాంగ్ గా స్పందించిన రేవంత్... అసంపూర్తిగా ఉన్న ఆలయంలో శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠను చేసే కార్యక్రమానికి అసలు నిజమైన హిందువు ఎవరూ వెళ్లబోరని అన్నారు. ఈ సందర్భంగా తనకు భద్రాచలంలోని రామాలయం అయినా.. అయోధ్యలోని రామమందిరం అయినా ఒక్కటేనని.. నిర్మాణ పూర్తయిన తర్వాత తాను కూడా అయోధ్య రామమందిరాన్ని సందర్శిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు!

కాగా... ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్... ఆహ్వానపత్రికలను అందించిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం పంపించింది.